Indian Nobel Laureates: ప్రస్తుతం ప్రపంచం దృష్టి నోబెల్ బహుమతుల విజేతల మీద ఉంది. సరే ఇప్పటి వరకు భారతదేశానికి ఎన్ని నోబెల్ బహుమతులు వచ్చాయో తెలుసా.. అలాగే అసలు నోబెల్ బహుమతులను ఇవ్వడం ఎప్పుడు ప్రారంభించారో ఐడియా ఉందా. 1901లో నోబెల్ బహుమతులను ఇవ్వడం ప్రారంభించారు. నాటి నుంచి నోబెల్ బహుమతులలో చాలా వరకు అర్హులైన వ్యక్తులకు ప్రదానం చేస్తూ వస్తున్నారు. తాజా ఈ ఏడాది కూడా అర్హులైన విజేతలకు నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు నోబెల్ బహుమతులు పొందిన భారతీయుల సంఖ్య తొమ్మిది.
మహాత్మా గాంధీ నోబెల్ శాంతి బహుమతికి ఐదుసార్లు నామినేట్ అయ్యారని, కానీ ప్రతిసారీ తిరస్కరించబడ్డారని (1937 నుంచి 1939 వరకు, 1947లో నుంచి జనవరి 1948లో ఆయన హత్యకు కొన్ని రోజుల ముందు) నార్వేజియన్ నోబెల్ కమిటీ డిసెంబర్ 1, 1999న ప్రకటించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో 1913లో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అలాగే నోబెల్ బహుమతి అందుకున్న మొదటి ఆసియన్ కూడా ఆయనే.
భారత్ నుంచి నోబెల్ బహుమతి పొందిన వారు ఎవరంటే..
రవీంద్రనాథ్ ఠాగూర్: రవీంద్రనాథ్ ఠాగూర్‌కు 1913లో సాహిత్యంలో నోబెల్ బహుమతి వరించింది. ఆయన రాసిన గీతాంజలి రచనకు గౌరవసూచకంగా సాహిత్యంలో నోబెల్ బహుమతిని ఆయనకు ప్రదానం చేశారు.
సి.వి. రామన్: సి.వి.రామన్‌కు 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన కాంతి పరిక్షేపణంపై చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు లభించింది. ఆయన పరిశోధనలకు గుర్తుగా రామన్ ఎఫెక్ట్ అనే పేరు పెట్టారు.
హరగోవింద్ ఖోరానా: హరగోవింద్ ఖోరానాకు 1968లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన “జన్యు సంకేతం, ప్రోటీన్ ఉత్పత్తిలో దాని పాత్ర యొక్క విశ్లేషణ కోసం” చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డు వరించింది.
మదర్ థెరిసా: మదర్ థెరిసాకు 1979లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. “మానవజాతి బాధల ఉపశమనానికి ఆమె చేసిన కృషికి గౌరవసూచకంగా” ఆమెకు నోబెల్ బహుమతిని ప్రదానం చేశారు.
సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్: సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌కు 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. ఆయన “నక్షత్రాల నిర్మాణం, పరిణామానికి కీలకమైన భౌతిక ప్రక్రియలపై చేసిన సైద్ధాంతిక పరిశోధనలకు” నోబెల్ బహుమతి లభించింది.
అమర్త్య సేన్: అమర్త్య సేన్‌కు 1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. “సంక్షేమ ఆర్థిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా” ఈ అవార్డు వరించింది.
వెంకట్రామన్ రామకృష్ణన్: వెంకట్రామన్ రామకృష్ణన్‌కు 2009లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. “రైబోజోమ్ నిర్మాణం, పనితీరు కోసం, స్థూల కణ స్ఫటికాకార శాస్త్రం”కు గాను ఆయను నోబెల్ బహుమతి లభించింది.
కైలాష్ సత్యార్థి: కైలాష్ సత్యార్థికు 2014లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. “పిల్లలు, యువతపై అణచివేతకు వ్యతిరేకంగా, పిల్లల విద్య కోసం ఆయన చేసిన కృషికి” గాను ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వరించింది.
అభిజిత్ బెనర్జీ: అభిజిత్ బెనర్జీకి 2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. “ప్రపంచ పేదరికాన్ని తగ్గించడానికి ఆయన వినూత్న విధానానికి” గాను ఈ అవార్డు లభించింది.
ప్రపంచంలోనే అతి చిన్న వయస్సులో నోబెల్ బహుమతి పొందింది ఎవరంటే..
అతి పిన్న వయస్సులో నోబెల్ బహుమతి పొందిన మలాలా యూసఫ్‌జాయ్. తన హక్కులను, లక్షలాది మంది యువతుల హక్కులను పొందేందుకు తన దేశంలోని మతపరమైన అధికారులకు వ్యతిరేకంగా పోరాడిన యువతిగా ఆమె చరిత్ర సృష్టించారు. “పిల్లలు, యువతపై అణచివేతకు వ్యతిరేకంగా, పిల్లలందరికీ విద్య హక్కు కోసం చేసిన పోరాటానికి” మలాలా, భారతీయ పిల్లల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థికి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది.
నోబెల్ బహుమతి అనేది సంస్కృతి, విద్యావేత్తలు, శాస్త్రీయ పరిశోధన రంగాలలో అసాధారణ విజయాలకు గుర్తింపుగా ఇచ్చే ప్రపంచవ్యాప్తంగా గౌరవాల సమాహారం. ఈ అవార్డులు అందించే బాధ్యత స్వీడిష్, నార్వేజియన్ సంస్థలు రెండింటిపై ఉంది. మొదటి నోబెల్ బహుమతి 1901లో ప్రదానం చేశారు.