Top 6 ODI World Cup matches between IND vs SL: సొంత గడ్డపై జరుగ్గుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజీలాండ్, ఇంగ్లండ్ లాంటి పటిష్ట జట్లపై జయకేతనం ఎగురవేసిన భారత్.. మెగా టోర్నీలో ఓటమెరుగని జట్టుగా ఉంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో గెలిచిన టీమిండియా దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక గురువారం శ్రీలంకతో భారత్ తన తదుపరి మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం అవుతుంది. భారత్ ఫామ్ చూస్తే లంకపై గెలవడం పెద్ద కష్టమేమి కాదు.
శ్రీలంకపై గెలిచి అధికారిక సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు ప్రపంచకప్ 2023లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో కేవలం రెండే గెలిచిన లంక.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో లంక గెలిచినా..సెమీస్ చేరాలంటే మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పసలేని లంక సెమీస్ చేరడం అసాధ్యమనే చెప్పాలి. ఇందుకు కారణం సీనియర్ ప్లేయర్స్ అందరూ కొద్ది కాలం వ్యవధిలో రిటైర్మెంట్ ఇవ్వడమే. ఇప్పుడు లంక అగ్ర జట్లకు పెద్దగా పోటీ ఇవ్వకపోయినా.. గతంలో టాప్ టీమ్‌గా కోనసాగింది. అన్ని జట్లకు గట్టి పోటీ ఇచ్చింది. 1996లో వన్డే ప్రపంచకప్ గెలిచింది. 2007, 2011లో రన్నరప్‌గా నిలిచింది. ఇదివరకు భారత్, శ్రీలంక మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు జరిగేవి. గత వన్డే ప్రపంచకప్‌లలో ఇరు జట్లలో ఎవరు పైచేయి సాధించారో ఓసారి చూద్దాం.
1996 ప్రపంచకప్:
1996 వన్డే ప్రపంచకప్ సెమీ-ఫైనల్లో భారత్-శ్రీలంక జట్లు తలపడ్డాయి. కలకత్తాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 8 వికెట్లకు 251 రన్స్ చేసింది. అరవింద డి సిల్వా (66), రోషన్ మహానామ (58) హాఫ్ సెంచరీలు చేశారు. భారత బౌలర్ జవగల్ శ్రీనాథ్ మూడు వికెట్స్ తీశాడు. లక్ష్య ఛేదనలో భారత్ 120 పరుగులకే పరిమితమైంది. సచిన్ టెండూల్కర్ టాప్ స్కోరర్ (65). సంజయ్ మంజ్రేకర్ (25), వినోద్ కాంబ్లీ (10) మాత్రమే డబుల్ డిజిట్ అందుకున్నారు. లంక బౌలర్ సనత్ జయసూర్య 3 వికెట్స్ పడగొట్టాడు.
1999 ప్రపంచకప్:
టాంటన్‌లో జరిగిన 1999 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్ భారీ విజయం అందుకుంది. సౌరవ్ గంగూలీ (183), రాహుల్ ద్రవిడ్ (145) సెంచరీలతో చెలరేగడంతో భారత్ 373/6 స్కోర్ చేసింది. ఆపై రాబిన్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక కేవలం 216 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో భారత్ 157 పరుగుల తేడాతో గెలిచింది.
2003 ప్రపంచకప్:
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన 2003 ప్రపంచకప్ సూపర్ 4 స్టేజ్ మ్యాచ్‌లో లంకను టీమిండియా ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ సచిన్ 97 రన్స్ చేయడంతో 292 పరుగులు చేసింది. ఆపై జవగల్ శ్రీనాథ్, ఆశిష్ నెహ్రా తలో 4 వికెట్స్ పడగొట్టడంతో లంక 109 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో భారత్ 183 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.
2007 ప్రపంచకప్:
పోర్ట్-ఆఫ్-స్పెయిన్‌లో జరిగిన 2007 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారత్‌ను శ్రీలంక ఓడించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 6 వికెట్లను 254 రన్స్ చేసింది. ఉపుల్ తరంగ (64), చమర సిల్వా (59) హాఫ్ సెంచరీలు చేశారు. భరత పేసర్ జహీర్ ఖాన్ 2 వికెట్స్ తీశాడు. ఆపై లక్ష్య ఛేదనలో భారత్ 185 పరుగులకే ఆలౌట్ అయింది. సౌరవ్ గంగూలీ (48), రాహుల్ ద్రవిడ్ (60) టాప్ స్కోరర్లు. లంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 3 వికెట్స్ తీశాడు.
20011 ప్రపంచకప్:
ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని వాంఖడే స్టేడియంలో జరిగిన 20011 ప్రపంచకప్ ఫైనల్‌లో శ్రీలంకపై భారత్ ఆరు వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ప్రపంచకప్ టైటిల్ అందుకుని యావత్ దేశాన్ని ఆనందంలో ముంచెత్తింది. ప్రపంచకప్ గెలవాలనే సచిన్ టెండూల్కర్ కలను నెరవేర్చింది. ఫైనల్లో లంక 274 రన్స్ చేయగా.. భారత్ మరో 10 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. గంభీర్ (97), ఎంఎస్ ధోని (91) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
2019 ప్రపంచకప్:
లీడ్స్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లంక 264 రన్స్ చేసింది. ఏంజెలో మాథ్యూస్ (13) సెంచరీ బాదాడు. ఆపై భారత్ 43.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ శతకాలతో మెరిశారు. ఇక 2023లో ఏం జరుగుతుందో చూడాలి.