IND vs SL Asia Cup 2023 Final : ఆసియా కప్ 2023 తుది సమరానికి రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. నేటి మధ్యాహ్నం 3 గంటలకు కొలంబోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ మొదలవుతుంది. బంగ్లాదేశ్‌తో చివరి ‘సూపర్-4’ మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయిన భారత్.. ఫైనల్‌ను మాత్రం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఆసియా కప్ ఫైనల్ గెలిచి వచ్చే నెలలో ఆరంభం అయ్యే వన్డే ప్రపంచకప్ 2023కి ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలనుకుంటోంది. సొంతగడ్డపై పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని టీమిండియాను ఓడించాలని లంక చూస్తోంది.
ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో సూపర్-4 మ్యాచ్‌లో మినహా భారత ప్రధాన బ్యాటర్లు నిలకడగా రాణించలేదు. ఫామ్ అందుకున్న ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ జట్టుకు మరోసారి ఆరంభాన్నివ్వాల్సిన అవసరముంది. కోహ్లీ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మిడిలార్డర్లో రాహుల్, హార్దిక్, జడేజా కీలకం. బంగ్లాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా, సిరాజ్, కుల్‌దీప్ తుది జట్టులోకి తిరిగి రానున్నారు. మరోవైపు లంక బ్యాటర్లు బాగా ఆడుతున్నారు. స్పిన్నర్ వెల్లలాగె, పేసర్ పతిరనతోనూ ముప్పు పొంచి ఉంది. స్పిన్నర్ తీక్షణ గాయపడి ఫైనల్‌కు దూరం అయినా డిసిల్వా, అసలంకలతో ప్రమాదమే.
కొలంబోలో మ్యాచ్ అంటే స్పిన్నర్లదే హవా. ఈ టోర్నీలో కొలంబోలో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లో స్పిన్నర్లే ఆధిపత్యం చెలాయించారు. ఆదివారం కూడా పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. ఇరు జట్లలో మంచి స్పిన్నర్లు ఉండడంతో బ్యాటర్లు కష్టపడాల్సిందే. ఈ పిచ్‌పై పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సిందే. అయితే కొలంబోలో పేసర్లకు కూడా కాస్త సహకారం ఉంటుంది.
Also Read: Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 14 మంది మృతి!
ఆసియా కప్ 2023 ఆరంభం నుంచి వెంటాడుతున్న వరుణుడు ఫైనల్‌ను కూడా వదిలిపెట్టేలా లేడు. ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ సమయంలో వర్షం పడేందుకు 50 నుంచి 60 శాతం వరకు అవకాశాలున్నట్లు కొలొంబో వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే మ్యాచ్ రద్దుకాదని సమాచారం. భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కల్పించారు. ఆదివారం ఫైనల్ జరగకపోతే.. సోమవారం మ్యాచ్‌ను నిర్వహిస్తారు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్/తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, ఆర్ జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్.
శ్రీలంక: పాతున్ నిశాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, సధీర సమరవిక్రమ, చరిత్ అసలంక, దాసున్ శానక (కెప్టెన్), ధనంజయ డిసిల్వా, దునిత్ వెల్లలాగె, దుషన్ హేమంత, కాసున్ రజిత, మహీశ పతిరన.