భారతదేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత సంబంధాలు మెరుగుపడతాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, సోమవారం నాడు ఇస్లామాబాద్‌లోని పార్లమెంట్ హౌస్ వెలుపల విలేకరులతో మాట్లాడిన ఆసిఫ్.. భారతదేశంలో ఎన్నికల తర్వాత మా సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయని అన్నారు. భారతదేశంలోని 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 మధ్య ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇస్లామాబాద్- న్యూ ఢిల్లీ మధ్య సుదీర్ఘమైన చర్చలు కొనసాగుతున్నాయని పాక్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ చెప్పారు.
Read Also: Raghunandan Rao: అప్పుడే చెప్పా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని.. కానీ మా మీదే కేసు పెట్టారు
ఇక, 2019లో భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసింది. దీంతో ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత పాకిస్తాన్- భారత్ మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. ఇక, నాలుగేళ్ల తర్వాత మళ్లీ పొరుగు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని పాకిస్తాన్ వెల్లడించింది. అయితే, పాకిస్తాన్ దాదాపు పరిశ్రమ స్థాయిలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని.. ఉగ్రవాదులను ఉపేక్షించే ధోరణిలో భారత్ లేదని.. ఇకపై దీనిని విస్మరించబోమని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సింగపూర్‌లో ప్రకటన చేసిన కొద్ది రోజుల తర్వాత ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.