IND vs AFG: వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత్ విజయాల బాటలో పయనిస్తోంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్‌లో చెమటోడ్చి గెలిచిన భారత్.. పసికూన అఫ్గానిస్థాన్ జట్టుపై అలవోకగా విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ భారీ శతకాన్ని నమోదు చేయడంతో 15 ఓవర్లు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో 273 పరుగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. అఫ్ఘాన్‌కు ఇది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి తొలి వికెట్‌కి 156 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.63 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో రోహిత్ శర్మ సెంచరీని పూర్తి చేశాడు. అఫ్గాన్ బౌలర్ మహ్మద్ నబీ వేసిన 18 ఓవర్‌లో మొదటి బంతికి ఫోర్ బాది 99కి చేరుకున్న రోహిత్.. తర్వాత బంతికి సింగిల్ తీసి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 63 బంతుల్లో శతకం బాది అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో ఏడో సెంచరీని తన ఖాతాలో వేసుకుని.. సచిన్(6) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.
Also Read: IND vs AFG: శతకం బాదిన హిట్ మ్యాన్.. సచిన్ రికార్డు బ్రేక్
మరో వైపు ఛేదనలో టీమిండియా తరఫున అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇంతకుముందు 1996లో సచిన్ టెండూల్కర్ 127 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వన్డే వరల్డ్ కప్‌లో 28 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ, 27 సిక్సర్లు బాదిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా అధిగమించేశాడు. ఇదిలా ఉండగా.. ఇషాన్ కిషన్(47), రోహిత్ శర్మ(131) ఇద్దరూ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే ఔట్ కావడం గమనార్హం. 56 బంతుల్లో 6 ఫోర్లతో 55 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ బౌండరీతో మ్యాచ్‌ని ముగించాడు. శ్రేయాస్ అయ్యర్ 23 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేశాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ జట్టు మంచి స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. భారత్‌కు 273 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అఫ్గాన్ బ్యాటర్లు హష్మతుల్లా షాహీది(80), అజ్మతుల్లా ఒమర్జాయ్(62) బ్యాటింగ్‌లో రాణించడంతో అఫ్గాన్ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టగా.. పాండ్యా రెండు వికెట్లు తీశాడు. శార్దూల్, కుల్‌దీప్ తలో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. 273 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది.