India vs West Indies 3rd ODI Preview and Playing 11: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో సునాయాసంగా గెలిచిన టీమిండియాకు.. రెండో వన్డేలో భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. అసలు ప్రత్యర్థి నుంచి పోటీనే ఉండదని భావించి.. ప్రయోగాలు చేసిన భారత్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే నేడు జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒత్తిడి మధ్య సిరీస్ విజయంపై భారత్ దృష్టి సారించగా.. సిరీస్ గెలిచే అవకాశాన్ని వదులుకోకూడదని విండీస్ చూస్తోంది. మొత్తానికి భారత్, వెస్టిండీస్ మూడో వన్డే రసవత్తరంగా సాగనుంది. గెలిచిన జట్టుకే సిరీస్ సొంతమవుతుంది.
కుర్రాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం విశ్రాంతి పేరుతో రెండో వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. కోహ్లీ చివరి వన్డే దాదాపుగా ఆడకపోవచ్చు. ఇందుకు కారణం లేకపోలేదు.. మ్యాచ్ కోసం బార్బడోస్ నుంచి ట్రినిడాడ్‌కు జట్టుతో కలిసి కోహ్లీ వెళ్లలేదని సమాచారం తెలుస్తోంది. మరోవైపు సిరీస్ డిసైడర్ మసీత్ కాబట్టి రోహిత్‌ను ఆడించాలని మేనేజ్మెంట్ చూస్తోందట. ప్రయోగాలకు పోకుండా ఓపెనర్‌గానే అతడు బరిలోకి దిగనున్నాడని తెలుస్తోంది.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. గత రెండు వన్డేలో మంచి ఆరంభాన్ని వృథా చేసుకున్న గిల్.. భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. తొలి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు బాదిన ఇషాన్ కిషన్.. మూడో స్థానంలో ఆడనున్నాడు. ప్రపంచకప్ 2023 బలాన్ని పరీక్షించుకునే నేపథ్యంలో సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌కు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇవ్వాలనుకుంటోంది. టీ20ల్లో అదరగొడుతున్న సూర్య వన్డేల్లో మాత్రం రాణించడం లేదు. గత మ్యాచ్‌లో ఆడిన శాంసన్ కూడా విఫలమయ్యాడు. సత్తాచాటేందుకు వీళ్లిద్దరికీ ఈ మ్యాచ్ మరో మంచి అవకాశం. ఈ ఇద్దరు 4, 5 స్థానాల్లో బ్యాటింగ్‌కు రానున్నారు.
బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్న హార్దిక్ పాండ్యా.. బ్యాటింగ్‌లో రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో కొత్త పేసర్లు ముకేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ అంచనాలను అందుకోవాల్సి ఉంది. శార్దూల్ ఠాకూర్ పర్వాలేదనిపిస్తున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మరోసారి చెలరేగితే టీమిండియాకు విజయం పెద్ద కష్టమేమీ కాదు. మరి భారత బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి.
తొలి వన్డేలో ఓడిన తర్వాత గొప్పగా పుంజుకున్న వెస్టిండీస్.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అదే ఊపులో ట్రోఫీ సొంతం చేసుకోవాలని చూస్తోంది. వన్డే ప్రపంచకప్ 2023కు అర్హత సాధించలేకపోయిన విండీస్.. భారత్‌పై సిరీస్ నెగ్గి ఊరట పొందాలని చూస్తోంది. కెప్టెన్ షై హోప్‌పై విండీస్ బాగా ఆధారపడుతోంది. అతనితో పాటు కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, కార్టీ, అథనేజ్, హెట్‌మయర్‌తో బ్యాటింగ్ బలంగానే ఉంది. స్పిన్నర్ మోటీ రాణిస్తున్నాడు. పేసర్ రొమారియో షెఫర్డ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అందరూ చెలరేగితే సిరీస్ సొంతం అవుతుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్, గిల్, ఇషాన్, శాంసన్, సూర్యకుమార్, హార్దిక్, జడేజా, శార్దూల్, ముకేశ్, కుల్దీప్, ఉమ్రాన్.
వెస్టిండీస్: కింగ్, మేయర్స్, అథనేజ్, హోప్, హెట్‌మయర్, కార్టీ, షెఫర్డ్, కరియా, అల్జారి జోసెఫ్, మోటీ, సీల్స్.
Also Read: Gold Today Rate: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు! నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?