IND vs WI 2nd ODI Preview and Playing 11: మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత్ శుభారంభం చేసిన విషయం తెలిసిందే. కెన్నింగ్‌టన్ ఓవల్ మైదానంలో 5 వికెట్ల తేడాతో విజయం సాదించిన రోహిత్ సేన.. రెండో వన్డేలోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై పరువు కాపాడుకోవాలని విండీస్ చూస్తోంది. బార్బడోస్ వేదికగానే జరిగే రెండో వన్డే శనివారం రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. డీడీ స్పోర్ట్స్, జియో సినిమాలో భారత్, వెస్టిండీస్ రెండో ఒన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది.
బౌలర్లు రాణించడంతో తొలి మ్యాచ్‌లో సునాయాసంగా గెలిచిన టీమిండియాకు బ్యాటర్ల తడబాటు మాత్రం ఆందోళన కలిగించే విషయమే. రెండో వన్డేల్లో ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. తొలి వన్డేలో లక్ష్యం చిన్నది కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాడు. అది పెద్దగా ఫలించలేదని చెప్పాలి. ఇషాన్ కిషన్ అర్ధ శతకంతో ఆకట్టుకున్నప్పటికీ.. శుభ్‌మన్ గిల్ (7) విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ ఆడే మూడో స్థానంలో ఆడిన సూర్యకుమార్ యాదవ్ (19) ఆకట్టుకోకపోగా.. హార్దిక్ పాండ్యా (5) తేలిపోయాడు. ప్రపంచకప్ 2023 నేపథ్యంలో గిల్, హార్దిక్, సూర్యలు ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉంది.
ఇషాన్ కిషన్ అర్ధ శతకం చేయడంతో కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే మిగలనుంది. రెండో వన్డేలోనూ సంజూ బెంచ్‌కే పరిమితం అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ అతడిని ఆడించాలనుకుంటే.. సూర్యను పక్కనపెట్టాల్సిందే. బార్బడోస్ వేదికగానే రెండో వన్డే జరుగుతుండడంతో భారత బౌలర్లు మరోసారి చెలరేగే అవకాశం ఉంది. అంచనాలను మించి రాణించిన కుల్దీప్ యాదవ్.. స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా మరోసారి కరీబియన్ జట్టును చుట్టేస్తారేమో చూడాలి. పేసర్లు ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్, హార్దిక్ పాండ్యా కూడా రాణించారు.
Also Read: Gold Today Price: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
తొలి వన్డేలో విండీస్ అన్ని విభాగాల్లో విఫలమైంది. భారత్‌పై మంచి రికార్డు ఉన్న షిమ్రాన్ హెట్‌మైర్‌పై విండీస్ ఆశలు పెట్టుకుంది. స్పిన్‌ను సమర్థంగా ఆడగల అతను మొదటి మ్యాచులో ఏమాత్రం ప్రభావం చూపలేదు. రెండో వన్డేలో అయినా ఆడాలని విండీస్ ఆశిస్తోంది. హోప్ ఫర్వాలేదనిపించాడు. బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్, రోవ్‌మాన్ పావెల్ ఆడితేనే విండీస్ కోలుకోగలదు. విండీస్ పోటీలో నిలవాలంటే బ్యాటింగ్‌లో కనీస ప్రదర్శన అయినా ఇవ్వాల్సి ఉంటుంది. బౌలర్లు యానిక్ కరియా, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్ రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్.
వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్ (కెప్టెన్), కీసీ కార్టీ, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, డొమినిక్ డ్రేక్స్, యానిక్ కారియా, గుడాకేష్ మోటీ, జేడెన్ సీల్స్.
Also Read: Mining Contract: ఖనిజాల తవ్వకాలు ప్రైవేటుకు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం