Shivam Dube Ract on his performance in T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు చాలా మద్దతు ఇచ్చారని టీమిండియా యువ ఆటగాడు శివమ్ దూబె తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ప్రతి మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, జట్టులోని సహచరులు అండగా నిలిచారన్నాడు. టీ20 ప్రపంచకప్ భారత జట్టు గెలవడంతో తన పాత్ర ఉండటం ఎంతో గర్వంగా ఫీలవుతున్నా అని దూబె చెప్పుకొచ్చాడు. పొట్టి టోర్నీలో దూబె 8 మ్యాచుల్లో 133 పరుగులు చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో కీలక సమయంలో 16 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివమ్ దూబె మాట్లాడుతూ… ‘టీ20 ప్రపంచకప్ ప్రయాణం చాలా బాగుంది. ఫైనల్ మ్యాచ్ అత్యంత కఠిన సవాల్ అని చెప్పాలి. జట్టు విజయంలో నా పాత్ర ఉండటం గర్వంగా ఫీలవుతున్నా. మెగా టోర్నీలో ప్రతి మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. సహచరులు అండగా నిలిచారు. అభిమానులు నిరంతరం ఉత్తేజపరిచారు. ఫైనల్ మ్యాచ్లో జట్టు కోసం నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించే అవకాశం దక్కింది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రయత్నించా. టోర్నీ ఆరంభంలో మాత్రం కాస్త ఇబ్బంది పడ్డా. ఆ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అండగా నిలిచారు. నా బలమేంటో చెప్పారు. వారి మద్దతు వల్లే రాణించగలిగా. నిరంతరం నా వెనకుండి నడిపించారు. నాపై వారికున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆడా. భవిష్యత్తులోనూ జట్టు విజయాల్లో నా పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నా’ అని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో శివమ్ దూబె ఆడాడు. చివరి మ్యాచ్‌లో 12 బంతుల్లో 26 పరుగులు చేశాడు. దీంతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక జులై 27 నుంచి ఆరంభం అయ్యే శ్రీలంకతో సిరీస్‌లో అతడికి చోటు ఖాయం. నేడు బీసీసీఐ భారత జట్టును ప్రకటించనుంది. ఈ సిరీస్‌లో కూడా రాణిస్తే.. భారత టీ20 జట్టులో సుస్థిర స్థానం అవుతుంది. ఇప్పటికే రోహిత్, కోహ్లీ, జడేజాలు వీడ్కోలు పలికిన నేపథ్యంలో యువకులకు అవకాశాలు దక్కనున్నాయి.