KL Rahul’s fighting innings will be central to the play on IND vs SA Day 1: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (70 బ్యాటింగ్; 105 బంతుల్లో 10×4, 2×6) పోరాడుతున్నాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో క్రీజులో నిలబడి భారత్ స్వల్ప పరుగులకే ఆలౌట్ కాకూండా చూశాడు. దాంతో తొలి రోజే దక్షిణాఫ్రికా పేసర్లకు దాసోహమన్నట్లు కనిపించిన భారత్.. రాహుల్ పుణ్యమాని కాస్త కోలుకుంది. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. రాహుల్ సహా మొహ్మద్ సిరాజ్ క్రీజులో ఉన్నాడు. ప్రొటీస్ పేసర్ కాగిసో రబాడ (5/44) చెలరేగాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కలేదు. ఫుల్‌షాట్ ఆడే రోహిత్ శర్మ (5) బలాన్నే.. బలహీనతగా మార్చి రబాడ తొలి వికెట్ సాధించాడు. ఆ తర్వాత బర్గర్ తన వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్ (17), శుభ్‌మన్ గిల్ (2) లను ఔట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. ఈ సమయంలో జట్టును విరాట్ కోహ్లీ (38; 64 బంతుల్లో 5×4), శ్రేయస్ అయ్యర్ (31; 50 బంతుల్లో 3×4, 1×6) ఆదుకునే ప్రయత్నం చేశారు. జీవనదానాలు పొందిన ఈ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఆడారు. మొదటి సెషన్‌ను భారత్ 91/3తో పూర్తి చేసింది.
Also Read: Astrology: డిసెంబర్ 27, బుధవారం దినఫలాలు
రెండో సెషన్‌లో రబాడ రెచ్చిపోయాడు. తొలి ఓవర్లోనే శ్రేయస్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆపై అద్భుత బంతితో కోహ్లీని బుట్టలో వేసుకున్నాడు. బౌన్సర్‌తో ఆర్ అశ్విన్ (8)ను వెనక్కి పంపాడు. దీంతో భారత్ 121/6తో కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాహుల్, శార్దూల్ (24; 33 బంతుల్లో 3×4) జట్టును ఆదుకున్నారు. ముఖ్యంగా పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై రబాడ చెలరేగుతున్నా.. బౌన్సర్లతో బెంబేలెతిస్తున్నా.. బ్యాటింగ్‌కు అత్యంత క్లిష్టంగా ఉన్న పిచ్‌పై రాహుల్ ఎప్పటికీ గుర్తుండిపోయే పోరాటం చేశాడు. బౌన్సర్లు శరీరానికి తగులుతున్నా.. బంతులు మీదకు దూసుకొస్తున్నా దృఢ సంకల్పంతో నిలబడ్డాడు. శార్దూల్ ఔట్ అయినా రాహుల్ ఆలౌట్ కాకుండా చూశాడు. రెండో రోజు కూడా రాహుల్ ఏక్కువగా స్ట్రైకింగ్ తీసుకుంటే భారత్ ఖాతాలో మరిన్ని చేరే అవకాశం ఉంది.