Ben Stokes Ract on Umpire’s Call in Rajkot Test: రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ‘అంపైర్స్ కాల్’ వల్ల తాము నష్టపోయాం అని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. హాక్‌ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందనిపించిందని, అంపైర్స్ కాల్ గురించి ఎవరినీ బ్లేమ్ చేయడం లేదన్నాడు. డీఆర్‌ఎస్‌పై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్టోక్స్ సూచించాడు. ఆదివారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 434 పరుగుల భారీ తేడాతో టీమిండియా చేతిలో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ మాట్లాడుతూ అంపైర్స్ కాల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘జాక్ క్రాలే డీఆర్‌ఎస్‌ను ఓసారి గమనిస్తే బంతి వికెట్ల పైనుంచి వెళ్తున్నట్లు ఉంది. అంపైర్స్ కాల్ కాబట్టి అతడు పెవిలియన్‌కు చేరాడు. బంతి స్టంప్స్‌ను తాకినట్టే లేదు. మేం అయోమయానికి గురయ్యాం. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. హాక్‌ఐ టెక్నాలజీ ఇంకా మెరుగైతే బాగుంటుందని నాకనిపించింది. అయితే దీని గురించి ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. మేం మూడుసార్లు అంపైర్స్ కాల్ వల్ల నష్టపోయాం. అంపైర్స్ కాల్ సరైందా? కాదా? అనేది పక్కన పెడితే మేం మాత్రం వికెట్లు కోల్పోయాం’ అని బెన్ స్టోక్స్ అన్నాడు.
Also Read: Ranchi Test: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం!
‘అంపైర్స్ కాల్ వల్లే ఓడిపోయామని చెప్పను. 500 పైగా లక్ష్యాన్ని ఛేదించడం తేలికేం కాదు. అయితే డీఆర్‌ఎస్ సాంకేతికతపై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ అంపైర్లు కఠినమైన విధులను నిర్వర్తిస్తారు. భారత్ వంటి టర్నింగ్ పిచ్‌లపై అంపైరింగ్ మరింత క్లిష్టంగా ఉంటుంది. అప్పుడు అంపైర్స్ కాల్ ఆప్షన్‌ను పక్కన పెడితేనే బాగుంటుంది. దీనిపై ఎక్కువగా మాట్లాడలేను. ఎందుకంటే.. టెస్టు మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి ఏం చెప్పినా దానిని సాకుగా భావిస్తారు’ అని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. స్టోక్స్ మూడో టెస్టులో 41, 15 పరుగులు చేశాడు.