Is Virat Kohli Re-Entering the Remaining 3 Tests Against England: ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం (ఫిబ్రవరి 6) ప్రకటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం మధ్యాహ్నం ముంబైలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించనున్నారు. అయితే అందరి కళ్లు మాత్రం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రీఎంట్రీపైనే ఉన్నాయి.
వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు విరాట్ కోహ్లీ దూరమైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా విరాట్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మూడో టెస్టుకు దాదాపు 10 రోజుల సమయం ఉండడంతో.. కోహ్లీ జట్టు ఎంపికకు అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ.. బీసీసీఐ అనుమతితో తొలి రెండు టెస్ట్‌లకు దూరమయ్యాడు. అయితే రెండోసారి తండ్రవుతున్నాననే విషయాన్ని విరాట్ అధికారికంగా ఎక్కడా చెప్పలేదు.
Also Read: OnePlus 12R Launch: నేడు మార్కెట్‌లోకి వన్‌ప్లస్ 12ఆర్ స్మార్ట్‌ఫోన్.. 6 బ్యాంక్ ఆఫర్‌లు ఇవే!
ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. చివరి మూడు టెస్ట్‌లకు ప్రస్తుత జట్టు దాదాపుగా కొనసాగనుంది. అయితే రెండు టెస్ట్‌ల్లో విఫలమైన శ్రేయాస్ అయ్యర్‌పై వేటు వేసి.. సర్ఫరాజ్ ఖాన్‌ను కొనసాగించవచ్చు. విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇస్తే మాత్రం రజత్ పటీదార్‌కు ఉద్వాసన తప్పదు. మూడో టెస్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్‌లోడ్ కారణంగా రాజ్‌కోట్ టెస్టుకు అతడిని పక్కన పెట్టాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గాయాల బారిన పడిన లోకేష్ రాహుల్, రవీంద్ర జడేజాలు మూడో టెస్ట్ ఆడే అవకాశాలు ఉన్నాయి.