Nitish Reddy Ruled Out of IND vs ENG Test Series Due to Injury: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్. తెలుగు ఆటగాడు, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరమయినట్లు తెలుస్తోంది. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా.. నితీశ్ మోకాలి లిగ్‌మెంట్ దెబ్బతిన్నట్లు సమాచారం. ఆదివారం జరిగిన శిక్షణా సెషన్‌లో అతడు పాల్గొనలేదు. గాయం కారణంగా మిగతా రెండు టెస్టు మ్యాచుల్లో నితీశ్ ఆడడని తెలుస్తోంది. అయితే బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.
హెడింగ్లీలో జరిగిన ప్రారంభ టెస్ట్‌కు దూరమైన నితీశ్ రెడ్డి.. శార్దుల్ ఠాకూర్ స్థానంలో రెండో టెస్టులో జట్టులోకి వచ్చాడు. మూడో టెస్టులో నితీశ్ మంచి ప్రదర్శన చేశాడు. అటు బ్యాటింగ్‌లో సైతం ఫర్వాలేదనిపించాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో 45 పరుగులు చేశాడు. లార్డ్స్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేశాడు. ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్‌లో జరిగిన రెండు టెస్ట్‌లలో 17 ఓవర్లు బౌలింగ్ చేసి 3.64 ఎకానమీతో రన్స్ ఇచ్చాడు. లార్డ్స్‌లో బెన్ డకెట్, జాక్ క్రాలీలను ఒకే ఓవర్‌లో అవుట్ చేసి టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.
Also Read: MLA Sri Ganesh : ఎమ్మెల్యే శ్రీగణేష్ పై దాడికి యత్నం.. కాన్వాయ్‌ని వెంబడించిన 30 మంది యువకులు
మరోవైపు గాయాల పాలైన ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌లు మాంచెస్టర్ టెస్ట్‌కు అందుబాటులో ఉంటారా? లేదా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పుడు నితీశ్ రెడ్డి కూడా గాయం బారిన పడడంతో టీమిండియాలో ఆందోళన పెంచుతోంది. అర్ష్‌దీప్ స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన అన్షుల్ కాంబోజ్ జట్టులోకి వచ్చాడు. అయితే నాలుగో టెస్టులో అతడు ఆడడం అనుమానమే. ఆకాష్, అర్ష్‌దీప్ ఆదుకుంటే.. బుమ్రా కచ్చితంగా మాంచెస్టర్ టెస్ట్‌లో ఆడాల్సిందే. సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. దాంతో మాంచెస్టర్‌లో జరగబోయే మ్యాచ్‌లో భారత్ తప్పనిసరిగా గెలవాలి.