India Bowling Coach Paras Mhambrey explains Why Mohammed Shami Not Get a Place in ODI World Cup 2023: నిజాయతీగా చెప్పాలంటే మొహ్మద్ షమీ వంటి బౌలర్‌ను పక్కన పెట్టడం అత్యంత క్లిష్టమైన నిర్ణయం అని భారత్ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లతో సంప్రదింపులు జరిపే నిర్ణయాలు తీసుకొంటామన్నాడు. ప్రపంచకప్ 2023 కోసం జట్టును ఎంపిక చేసినప్పుడే ప్రతి ఒక్కరికీ స్పష్టమైన సమాచారం ఇచ్చామని, పిచ్‌ను బట్టి తుది జట్టును ఎంపిక ఉంటుందని స్పష్టం చేశామని మాంబ్రే చెప్పారు. భారత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో టీమిండియా నేడు పుణె వేదికగా బంగ్లాదేశ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. అయితే తుది జట్టు ఎంపికపై మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్ కోచ్ స్పందించాడు.
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగే పుణె పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో టీమిండియా బౌలింగ్ విబాగంలో ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో మేనేజ్మెంట్ తర్జనభర్జనలు పడుతోంది. శార్దూల్ ఠాకూర్ బదులుగా సీనియర్ పేసర్ మొహ్మద్ షమీని జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్స్ సోషల్ మీడియాలో వచ్చాయి. ప్రపంచస్థాయి బౌలర్ షమీని గత మూడు మ్యాచుల్లోనూ బెంచ్‌కే పరిమితం చేయడంపై మాజీలు సహా ఫాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే వివరణ ఇచ్చాడు.
‘‘మొహ్మద్ షమీ వంటి బౌలర్‌ను పక్కన పెట్టడం క్లిష్టమైన నిర్ణయం. అయితే ప్రతి మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లతో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటాం. ప్రపంచకప్ 2023 కోసం జట్టును ఎంపిక చేసినప్పుడే ప్రతి ఒక్కరికీ ఓ విషయం చెప్పాం. పిచ్‌ను బట్టి తుది జట్టును ఎంపిక చేసుకుంటామని క్లియర్ మెసేజ్ ఇచ్చాం. ఆర్ అశ్విన్ తొలి మ్యాచ్‌లో ఆడి.. తర్వాత రెండు మ్యాచులకూ జట్టులో లేదు. అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నామనేది అతడికి వివరించాం. కొన్నిసార్లు కొందరు స్టార్ ఆటగాళ్లకు కూడా తుది జట్టులో స్థానం దక్కకపోవచ్చు. మరికొన్నిసార్లు ప్రత్యామ్నాయ ఆటగాళ్లకు ఆడే అవకాశం రావచ్చు’ అని పరాస్ మాంబ్రే తెలిపాడు.
Also Read: IND vs BAN: అమ్మో అక్కడుంది విరాట్ కోహ్లీ.. అస్సలు స్లెడ్జింగ్ చేయను: ముష్పీకర్ రహీమ్
‘జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి రావడంతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా మారింది. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి బౌలర్ల జాబితాలో అతడు ముందుంటాడు. మిడిల్ ఓవర్లలోనూ పరుగులను నియంత్రించి.. వికెట్లు తీయగలడు. ప్రపంచకప్‌కు ముందే పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఏ జట్టును తేలిగ్గా తీసుకోము. తొమ్మిది జట్లతో తొమ్మిది వేదికలపై ఆడుతున్న ఏకైక జట్టు భారత్. ప్రతి మ్యాచ్‌లోనూ సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నాం. బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్.. ఏ జట్టైనా గేమ్ ప్లాన్ ఒకేలా ఉంటుంది’ అని భారత్ బౌలింగ్ కోచ్ చెప్పాడు.