టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రశంసలు కురిపించాడు. తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ బుమ్రానే అని తెలిపాడు. ప్రపంచంలోనే అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బెస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడన్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం బుమ్రా సొంతం అని మ్యాక్స్‌వెల్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు, ఐపీఎల్ మ్యాచ్‌లలో చాలాసార్లు బుమ్రా బౌలింగ్‌ను మ్యాక్సీ ఎదుర్కొన్నాడు.
ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో షేర్ చేసిన వీడియోలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ… ‘నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అన్ని ఫార్మాట్లలో ఆల్‌టైమ్ బెస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడు. బుమ్రా బంతిని వదిలే స్థానం చాలా భిన్నంగా ఉంటుంది. చివరి నిమిషంలో బంతి గమ్యాన్ని ఇట్టే మార్చగలడు. అద్భుతమైన యార్కర్‌ను వేయడమే కాకుండా.. ఎవరూ ఊహించని విధంగా స్లో బాల్‌ను కూడా వేయగలడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం బుమ్రా సొంతం. అతడికి అద్భుతమైన మణికట్టు ఉంది. మంచి ఫాస్ట్ బౌలర్ వద్ద ఉండాల్సిన అన్ని అస్త్రాలు బుమ్రా దగ్గర ఉన్నాయి. అతడి బౌలింగ్‌లో అస్సలు ఆడలేం’ అని అన్నాడు.
Also Read: Gold Rate Today: పండగ వేళ మహిళలకు షాక్.. మరోసారి 80 వేలు దాటిన గోల్డ్ రేట్స్!
వైవిధ్యమైన షాట్లు ఆడే గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై జస్ప్రీత్ బుమ్రా ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్‌ల్లో ఏడుసార్లు మ్యాక్సీని ఔట్ చేశాడు. నవంబర్ 22 నుంచి బోర్డర్-గవాస్కర్ 2024-25 ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇది రోహిత్ సేనకు ఎంతో కీలకమైన సిరీస్. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో టెస్టులో అతడికి విశ్రాంతినిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఇప్పుడు నంబర్ వన్‌గా ఉన్న విషయం తెలిసిందే.