Rahul Dravid Speaks On His Future As Team India Head Coach: భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ 2023ను టీమిండియా చేజార్చుకుంది. ఆదివారం నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. దాంతో పదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే భారత్ అభిమానుల కల.. కలగానే మిగిలిపోయింది. ఫైనల్‌లో భారత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక భారత్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం అధికారికంగా ముగిసింది. బీసీసీఐ కాంట్రాక్ట్ ప్రకారం.. వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో ద్రవిడ్ పదవీకాలం పూర్తవుతుంది.
రాహుల్ ద్రవిడ్ భారత హెడ్ కోచ్‌గా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. రెండేళ్ల పదవి కాలంలో ఐసీసీ టోర్నీలకు సంబంధించి రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు జట్టును తీసుకెళ్లాడు. ఆసియా కప్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపాడు. దీంతో హెడ్ కోచ్‌గా ద్రవిడ్‌ను కొనసాగిస్తారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ద్రవిడ్ తాజాగా స్పందించాడు. రెండేళ్ల పదవి కాలం ముగిసింది, కనీసం ఒక్క ఫార్మాట్‌లోనైనా భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం వస్తే స్వీకరిస్తారా? అని వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
‘ఇప్పటివరకు అలాంటి ఆలోచన లేదు. హెడ్ కోచ్ గురించి ఆలోచించే తీరికా లేదు. వన్డే ప్రపంచకప్ 2023నే దృష్టిసారించాం. సమయం ఉండుంటే ఆలోచించి ఉండేవాడినేమో కానీ టోర్నీ సమయంలో దృష్టంతా దీనిపైనే ఉంచాం. నా రెండేళ్ల పనితీరుపై బయట నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోను. నా బాధ్యతలను ఎలా నిర్వర్తించానని నేనే విశ్లేషించుకుంటా. భారత జట్టుతో పని చేసినందుకు గర్వపడుతున్నా. ఆటగాళ్లతో కలిసిపోయి పని చేయడం ఆనందంగా ఉంది. దీన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా’ అని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.
Also Read: Mitchell Marsh World Cup Trophy: మిచెల్ మార్ష్.. అంత ‘బలుపు’ అనవసరం! మండిపడుతున్న క్రికెట్ ఫాన్స్
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఆ టోర్నీకి కూడా భారత జట్టుకు కోచింగ్ వ్యవహారాలు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నారా? అనే ప్రశ్నకు కూడా రాహుల్ ద్రవిడ్ జవాబు ఇచ్చాడు. ‘భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఇప్పటికైతే ఎలాంటి ప్రణాళికలు లేవు. 2027 వన్డే ప్రపంచకప్ గురించి ఇప్పుడే ఆలోచించడం సరికాదు. ఎవరు ఆడుతారు?, ఎవరు వెళ్లరు? అనేది చెప్పడం కష్టం. దానికి ఇంకా చాలా సమయం ఉంది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.