బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో అత్యంత కీలకమైన నాలుగో టెస్టులో తొలి రోజు ఆతిథ్య ఆస్ట్రేలియానే ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజులో కూడా ఆధిపత్యం చేయిస్తోంది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా 454/7 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (139), మిచెల్ స్టార్క్(15)లు క్రీజులో ఉన్నారు. మొదటి రోజు యువ ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (60; 65 బంతుల్లో 6×4, 2×6), స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (72; 145 బంతుల్లో 7×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. అయితే మొదటి రోజు ఉదయం ఆటలో లబుషేన్, కొన్‌స్టాస్‌ల తీరు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆగ్రహం తెప్పించింది.
సామ్ కొన్‌స్టాస్, మార్నస్ లబుషేన్‌లు పరుగు తీసే క్రమంలో పదే పదే పిచ్ మీద నడిచారు. దాంతో రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి పడే ప్రదేశంలో నడిస్తే.. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో లబుషేన్ దగ్గరికి వెళ్లి రోహిత్ వాదనకు దిగాడు. రోహిత్ ఫైర్ అవ్వడంతో ఇకపై పిచ్ మీద పరుగెత్తమని లబుషేన్ చెప్పాడు. అయితే ఈ విషయంలో అంపైర్లు మాత్రం జోక్యం చేసుకోలేదు. ఆసీస్ బ్యాటర్లను అంపైర్లు హెచ్చరించకపోవడం గమనార్హం.