IND beat AFG in Second Super Over: అఫ్గానిస్థాన్, భారత్ జట్ల మధ్య నామమాత్రమనుకున్న మ్యాచ్.. సిక్సులు, ఫోర్లు, నరాలు తెగే ఉత్కంఠతో అభిమానులకు అసలైన మజాను అందించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి.. మంచి వినోదాన్ని పంచింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠ రేపిన మూడో టీ20లో రెండో సూపర్ ఓవర్లో అఫ్గానిస్థాన్‌ను భారత్ ఓడించింది. ముందుగా మ్యాచ్ టై (212 పరుగులు) కాగా.. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. ఇక రెండో సూపర్ ఓవర్‌లో ముందుగా భారత్ 11 రన్స్ చేయగా.. అఫ్గాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
మూడో టీ20 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్లకు 212 పరుగులు సాధించింది. రోహిత్ శర్మ (121 నాటౌట్; 69 బంతుల్లో 11×4, 8×6), రింకు సింగ్ (69 నాటౌట్; 39 బంతుల్లో 2×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కీలక వికెట్స్ కోల్పోయినా.. రోహిత్, రింకు అద్భుత భాగస్వామ్యం టీమిండియాకు భారీ స్కోర్ అందించింది. 6 ఓవర్లలో 30/4, 11 ఓవర్లకు 65/4 ఉన్నా.. ఆ తర్వాత రోహిత్, రింకుల విధ్వంసంతో భారత్ ఎవరూ ఊహించనంత స్కోరు సాధించింది. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిన ఈ జంట స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. చివరి 9 ఓవర్లలో ఇద్దరు కలిసి ఏకంగా 147 పరుగులు పిండుకున్నారు.
లక్ష్యం పెద్దదే అయినా ఓపెనర్లు గుర్బాజ్ (50; 32 బంతుల్లో 3×4, 4×6), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో 4×4, 1×6) రాణించడంతో 10 ఓవర్లలో 85/0తో అఫ్గాన్ రేసులో నిలిచింది. 11వ ఓవర్లో గుర్బాజ్‌ను కుల్దీప్ ఔట్ చేయడంతో భారత్‌కు మొదటి వికెట్ దక్కింది. 13వ ఓవర్లో జద్రాన్, అజ్మతుల్లాలను సుందర్ ఔట్ చేశాడు. చివరి ఏడు ఓవర్లలో అఫ్గాన్ విజయానికి 105 పరుగులు అవసరం అయ్యాయి. ఈ సమయంలో నైబ్ (55 నాటౌట్; 23 బంతుల్లో 4×4, 4×6), నబి (34) విధ్వంసంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆఖరి ఓవర్లో అఫ్గాన్‌కు 19 పరుగులు అవసరం కాగా.. ముకేశ్ తడబడడంతో మ్యాచ్ టై అయింది. ఆట సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
Also Read: Delhi: 14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. తల్లి “లివ్-ఇన్ పార్ట్‌నర్” అఘాయిత్యం..
మొదటి సూపర్ ఓవర్లో మొదట అఫ్గాన్ 16 పరుగులు చేయగా.. భారత్ కూడా 16 పరుగులు సాధించడంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు వెళ్ళింది. రెండో సూపర్ ఓవర్లో మొదట భారత్ 11 పరుగులే చేయడంతో.. గెలుపు కష్టమే అనుకున్నారంతా. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసిన సిన్నర్ రవి బిష్ణోయ్.. మూడు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి అఫ్గాన్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. నిబంధనల ప్రకారం.. సూపర్ ఓవర్‌లో రెండు వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్టే. ఇక మారిన నిబంధనల ప్రకారం ఫలితం తేలే వరకు ఎన్ని సూపర్ ఓవర్లయినా ఆడాల్సి ఉంటుంది.