Tirumala Ghat Road Accidents: తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కొందరూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా.. స్వామి సేవలో పాల్గొంటుంటే.. దురదృష్టవశాత్తు ఇంకొందరు ఆస్పత్రి పాలవుతున్నారు. ఎందుకనుకుంటున్నారా..? వారి వారి వాహనాల్లో వచ్చేటప్పుడు తిరుమల ఘాట్‌రోడ్లపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత వారంలో జరిగిన వరుస యాక్సిడెంట్లతో అటు భక్తులు.. ఇటు టీటీడీ అధికారులు ఉలిక్కిపడ్డారు. రెండు ఘాట్ రోడ్లలో కలిపి ఐదారు ప్రమాదాలు జరిగాయి. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఇవాళ(శుక్రవారం) కూడా ఓ ప్రమాదం సంభవించింది. మొదటి ఘాట్ రోడ్డులో చివరి మలుపు వద్ద ఓ కారు రెయిలింగ్ ను ఢీకొట్టింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో.. అందులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. వారు తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించారు.
Read Also: HEALTH: తెలిసి తెలియని వయసు.. బాగా తినేసింది. ఆరోగ్యం విషమంగా ఉంది
అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్లలో చిన్నపాటి ప్రమాదాలు జరుగుతుంటాయి కానీ.. పదుల సంఖ్యలో భక్తులతో వెళ్తున్న బస్సు, టెంపో లాంటి వాహనాలు పల్టీలు కొట్టడం మరింత టెన్షన్ కలిగిస్తోంది. అయితే ప్రమాదాలకు వాహనదారులు కారణమా.. లేదంటే ఘాట్ రోడ్లలో మార్పులు చేయాల్సి ఉందా అన్న దానిపై చర్చిస్తున్నారు టీటీడీ అధికారులు. మరోవైపు మే 28న మొదటి ఘాట్ రోడ్ లో ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరు భక్తులు గాయపడ్డారు. అదృష్టవశాత్తు బస్సు పల్టీలు కొట్టకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే విధంగా మొదటి ఘాట్ రోడ్డులో 6వ మలుపు దగ్గర కర్ణాటకకు చెందిన టెంపో ట్రావెలర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అదేవిధంగా తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్లో కూడా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి రెండు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. మొదటి ఘాట్ రోడ్ లో మరో వాహనం ప్రమాదానికి గురైంది.
Read Also: Viral News: ఇదేం పైత్యం సామి.. ఆఖరికి పాములను కూడా వదలరా..
ఇలా తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే నాలుగు ప్రమాదాలు జరిగాయి. వాటిలో మూడు వాహనాలు కర్ణాటకకు చెందినవిగా గుర్తించారు. మంగళవారం రాత్రి కూడా ఘాట్‌లో ఒక ప్రమాదం జరిగింది. మే 14న రెండు ప్రమాదాలు జరిగాయి. దాంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరోవైపు తిరుమల కొండపైకి వెళ్లడానికి, కిందకు రావడానికి రెండు వేర్వేరు ఘాట్ రోడ్లు ఉన్నాయి. మొదట ఒకే ఘాట్ రోడ్ మీదుగా తిరుమలకు రాకపోకలు సాగేవి. ప్రమాదాలు, భక్తుల రద్దీతో ట్రాఫిక్ జామ్‌ను దృష్టిలో పెట్టుకుని.. రెండోఘాట్ రోడ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నో మూలమలుపులు, బ్లాక్ స్పాట్స్ ఉన్న తిరుమల ఘాట్ రోడ్లలో గతంలో ఎప్పుడూ ఇంతలా ప్రమాదాలు జరగలేదు. వాహనాలు ఢీకొని చిన్నచిన్న ఘటనలే తప్ప.. చెప్పుకోదగ్గర ప్రమాదాలేం జరగలేదు. కానీ ఈ మధ్య జరుగుతున్న ప్రమాదాలు భక్తలను, టీటీడీ అధికారులను ఆందోళన కలిగిస్తున్నాయి. చూడాలీ మరి ప్రమాదాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో..