Murder Case: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని వెలగపూడి గ్రామంలో 2020 డిసెంబర్ 27న జరిగిన మరియమ్మ హత్య కేసులో శుక్రవారం 34 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరు డిఎస్పీ టి.మురళీ కృష్ణ ఆధ్వర్యంలో ఈ అరెస్టులు జరిగాయి. ఈ కేసు 2020 డిసెంబరులో గ్రామంలోని రెండు వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడి ఘటనకు సంబంధించింది. గ్రామంలో ఒక వీధి ప్రారంభంలో కొత్తగా నిర్మించిన ఆర్చీకి పేరు నిర్ణయించే క్రమంలో రెండు వర్గాలు ఆందోళనకు దిగాయి. ఈ వివాదం జరగడంతో అందులో మెండెం మరియమ్మ (40) అనే మహిళ దుర్మరణం చెందింది.
Also Read: Vangalapudi Anitha: పవన్ కళ్యాణ్ భద్రతపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి
ఈ ఘటనపై బాధితులు ఆగ్రహంతో మృతదేహాన్ని రహదారిపై ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో బాపట్ల ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌పై విమర్శలు చేశారు. ఆందోళన నేపథ్యంలో, పోలీసులు నందిగం సురేష్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇటీవల, సలివేంద్ర సురేష్ అనే నందిగం సురేష్ అనుచరుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించారు. శుక్రవారం మరో 34 మందిని పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. వారందరికి న్యాయస్థానం జనవరి 9 వరకు రిమాండ్ విధించింది. ఇప్పటి వరకు ఈ కేసులో 36 మందిని అరెస్టు చేసిన పోలీసులు, తాజా అరెస్టులతో మొత్తం 70 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు మృతి చెందారు. మరొక 6 మందిని పోలీసులు త్వరలో అరెస్టు చేయనున్నారు. నిందితుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పోలీసులు గట్టి దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఆదేశాలను అనుసరించి మరింత మందిని అరెస్టు చేయడానికి పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.