Pakistan: పాకిస్థాన్‌లో బాంబులు పేలడం కొత్తకాదు. కానీ ఈ సారి నిజంగానే కొత్త రకం బాంబు పేలి దేశంలో సంచలనం రేపింది. ఇంతకీ ఆ బాంబు ఏంటని ఆలోచిస్తున్నారా.. మీకు ఇమ్రాన్ ఖాన్ గుర్తుకు ఉన్నారా.. ఆయన పాక్ తరుఫున క్రికెట్ ఆడి సంచలనాలు సృష్టించారు. తర్వాత ఆయన దేశంలో పీటీఐ అనే పార్టీ పెట్టి రాజకీయాలను కూడా ఒక ఆట ఆడుకున్నారు. పాపం ఎక్కడ చెడిందో ఏమో గానీ ఆ దేశ సైన్యానికి ఇమ్రాన్‌కు గట్టిగా చెడింది. దీంతో పాక్‌లో అప్పటి వరకు అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి కాస్త జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎన్ని సార్లు బెయిల్‌కు దరఖాస్తుకు చేసుకున్నా ఆయనకు మాత్రం ఆ నాలుగు గోడల నుంచి విముక్తి రావడం లేదు. దీంతో ఆయన తాజా కొత్త రకం బాంబు దేశం యావత్తు చూస్తుండగా పేల్చారు. ఇంతకీ ఆ బాంబు వారి దేశంలో ఎన్ని ప్రకంపనలు సృష్టించిందో ఈ స్టోరీలో చూద్దాం..
READ ALSO: Char Dham : చార్ థామ్ యాత్రలో హెలికాప్టర్ సేవలకు డీజీసీఏ ఆమోదం
పాక్ చీఫ్ జస్టిస్‌కు లెటర్ బాంబ్ ..
పాకిస్థాన్‌లోని రావల్పిండి అడియాలా జైలులో ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి యాహ్యా అఫ్రిదికి నేరుగా లేఖ రాశారు. లేఖలో ఉన్నత న్యాయస్థానాలలో తన కేసు విషయంలో పక్షపాతం, 2024 ఎన్నికలలో రిగ్గింగ్, రాజ్యాంగ సవరణలను దుర్వినియోగం చేయడం వంటి తీవ్రమైన ఆరోపణలను లేవనెత్తారు. ఇమ్రాన్ ఖాన్ లేఖను ఆయన పార్టీ సభ్యుడు లతీఫ్ ఖోసా సుప్రీంకోర్టుకు సమర్పించారు.
సెప్టెంబర్ 16 నాటి ఆ లేఖలో.. పెండింగ్‌లో ఉన్న “ముఖ్యమైన పిటిషన్ల”పై విచారణలను షెడ్యూల్ చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ఫ్రాజ్ డోగర్‌పై కూడా ఆయన నేరుగా దాడి దిగారు. 26వ రాజ్యాంగ సవరణ కారణంగా డోగర్ ఆ పదవిలో కొనసాగుతున్నారని, అల్-ఖాదిర్ ట్రస్ట్, తోషఖానా కేసులో పిటిషన్లను విచారించకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని ఖాన్ విమర్శించారు. కోర్టు నిష్పాక్షికతను విడిచిపెట్టి తనపై అన్యాయమైన, నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తన పార్టీ అఖండ విజయం సాధించినప్పటికీ, ఆ తీర్పును “రాత్రిపూట దొంగిలించారని” ఆయన రాసిన లేఖలో పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలిపశువుగా మార్చారని విమర్శించారు. కామన్వెల్త్ అబ్జర్వర్ గ్రూప్ నుంచి లీక్ అయిన నివేదిక కూడా ఎన్నికల మోసాన్ని నిర్ధారించిందని ఇమ్రాన్ పేర్కొన్నారు.
రెండు ఏళ్లుగా జైలులో ఇమ్రాన్..
72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ అనేక కేసులను ఎదుర్కొంటూ.. రెండు ఏళ్లకు పైగా జైలులో ఉన్నారు. ఆయన భార్య బుష్రా బీబీ కూడా అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో జైలు శిక్ష అనుభవించారు. జైలు శిక్ష అనుభవిస్తున్నప్పటికీ ఆయన తనను తాను దేశ ప్రజల నిజమైన గొంతుగా చెప్పుకుంటున్నారు. 26వ రాజ్యాంగ సవరణను ఆయన “రాజకీయ ఆయుధం” అని పిలిచారు. ఎన్నికల రిగ్గింగ్‌ను చట్టబద్ధం చేయడానికి దీనిని ఉపయోగించారని విమర్శించారు. ఈ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను వెంటనే విచారించాలని ఆయన సుప్రీంకోర్టుకు తన లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ ఈ లేఖపై విశేషంగా చర్చ నడుస్తుంది.
READ ALSO: Tokyo: పాపం నీరజ్ చోప్రా.. సూపర్ సచిన్! జావెలిన్‌లో షాకింగ్ ట్విస్ట్..