అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సుంకాల ప్రకటనను అంచనా వేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి అధ్యక్షత వహిస్తున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, డీఐఐటీ ఇంకా ఇతర విభాగాల సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని, సుంకాల ప్రభావాలను పిఎంఓకు వివరించారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం ట్రంప్ సుంకాలపై ఉన్నతస్థాయిలో అంచనాలను తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.
Read Also: Amazon Project Kuiper: తొలి ఇంటర్నెట్ ఉపగ్రహాల కోసం ప్రాజెక్ట్ ‘కైపర్’ను సిద్ధం చేసిన అమెజాన్
ఇందులో భాగంగా.. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ట్రంప్ సుంకాలపై స్పందిస్తూ, ఈ నిర్ణయాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భారతదేశం వాణిజ్య సంబంధిత సమస్యలను పరిష్కరిస్తే, అమెరికా ఈ సుంకాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ నిర్ణయం షాక్ కలిగించదని, మిశ్రమ ఫలితంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, అమెరికా సుంకాలను తగ్గించే దిశగా సరైన ప్రతిస్పందనలను పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇకపోతే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రకాల సుంకాలను విధించారు. మొదటి సుంకం ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి రాబోతుంది. ఈ సుంకం అన్ని దేశాలతో పోల్చితే 10 శాతం బేస్ టారిఫ్‌గా అమలు చేయబడుతుంది. గతంలో ఈ సుంకం 2.5 శాతంగా ఉండేది. ఈ నిర్ణయం ద్వారా అమెరికా అన్ని దేశాలకు బేస్ టారిఫ్‌ను పెంచింది. ఇక రెండో విషయానికి వస్తే., ప్రతి దేశంపై వేర్వేరు సుంకాలను విధించడం ప్రారంభించనుంది. అంటే ఒక దేశం అమెరికాపై 40 శాతం సుంకం విధిస్తే, అమెరికా ఆ దేశంపై 20 శాతం సుంకం విధించినట్లుగా సమాచారం. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అమెరికా భారతదేశంపై 26 శాతం సుంకం విధించబోతున్నట్లు సమాచారం.
Read Also: Viral Video: అర్ధరాత్రి వంటింటి గోడపై ప్రత్యక్షమైన మృగరాజు!
ఈ కొత్త సుంకాల ప్రభావం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. అమెరికా సుంకాలను పెంచడం భారతదేశానికి కూడా కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు, కానీ ఈ సుంకాలను తగ్గించడానికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఈ పరిణామాలను సమీక్షించి, అవసరమైన చర్యలను తీసుకుంటుందని భావిస్తున్నారు.