రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడులోని వివిధ ప్రాంతాలతోపాటు అరేబియా సముద్రం, ఆగ్నేయ, నైరుతి, ఈశాన్య బంగాళాఖాతం మీదుగా చురుగ్గా ముందుకు కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలతోపాటు అక్కడక్కడ ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వానాకాలం భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తీపికబురు అందించింది. దీర్షకాలం పాటు సగటున 103 శాతం వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో చాలా భాగం భారీవర్షాలు పడతాయని, ప్రస్తుత సీజన్‌లో గతంలో ప్రకటించిన విధంగా గాక ఎక్కువ వానలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ఈశాన్యంలో మాత్రం తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. సాధారణంగా జూన్ 1వ తేదీకి నైరుతి రుతుపవనాలు జూన్ 1 వ తేదీకి రావాలి. కానీ ఈసారి మూడురోజుల ముందే మే 29వ తేదీకి కేరళలో పలకరించాయి. తాజాగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వర్షాలు పడ్డాయి.