IIIT Student Suicide: సెల్‌ఫోన్‌ను దొంగిలించిందనే అభియోగంపై మందలించడంతో మనస్తాపానికి గురైన ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన వైఎస్సార్ జిల్లా ఇడుపాలపాయ ట్రిపుల్ ఐటీ మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం గ్రామానికి చెందిన మక్బూల్,నసీమా దంపతులకు కుమారుడు సోహెల్ అబ్బాస్, కుమార్తె జమీషా ఖురేషీలు ఉన్నారు. జమీషా ఖురేషి(17)కి ఇడుపులపాయ క్యాంపస్‌లోని ఒంగోల్ ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. మొదటి సంవతసరం పీయూసీ-1లో మంచి మార్కులు సాధించింది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతోంది.
Read Also: Online Rummy : చెన్నైలో విషాదం నింపిన ఆన్ లైన్ రమ్మీ
ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం హాస్టల్‌లో ఓ విద్యార్థిని తన సెల్‌ఫోన్‌లో మరిచిపోయారు. తన ఫోన్ కనిపించడం లేదంటూ వార్డెన్‌కు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీని పరిశీలించగా.. ఆ ఫోన్‌ను జమీషా ఖురేషీ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ అధికారులు ఆమెను అందరి ముందు మందలించారు. జరిగిన విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో అవమానంగా భావించి మంగళవారం అర్ధరాత్రి హాస్టల్‌లోని స్నానాల దిలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్‌లో ఉన్న తోటి విద్యార్థులు రాత్రి స్టడీ అవర్స్‌కు వెళ్లడంతో ఎవరూ గుర్తించలేదు. 10 గంటల తర్వాత విషయం తెలుసుకున్న ట్రిపుల్ ఐటీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమ కుమార్తె ఆరోగ్యం సరిగా లేదని ట్రిపుల్ ఐటీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి సమాచారం ఇచ్చారని.. తీరా అక్కడికి వెళ్తే ఆత్మహత్య చేసుకుందని ఖురేషి తల్లిదండ్రులు విలపించారు.