IG Ravi Prakash: ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ, యువత తమ బంగారు భవిష్యత్ ను పాడు చేసుకోవద్దని సూచించారు ఐజీ, ఎలూరు రేంజ్ కౌంటింగ్ ప్రత్యేక అధికారి ఎం.రవిప్రకాష్.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కౌంటింగ్ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించడానికి అమలాపురం వచ్చిన రవి ప్రకాష్.. ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ సందర్భంగా రాజకీయ పక్షాలు, ప్రజలు సంయమనం పాటించాలని ఐజీ కోరారు. 144 సెక్షన్, సెక్షన్ 30 అమలులో ఉన్నాయని ఎటువంటి విజయోత్సవాలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
Read Also: CM Revanth Reddy: సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దేశంలో కాంగ్రెస్‌దే అధికారం..
ఇక, ఎన్నికల్లో ప్రజాభిప్రాయానికి విలువ నివ్వాల్సిందేనని ఫలితాలు జీర్ణించుకోలేక రాజకీయ పార్టీల కార్యకర్తలు అభిమానులు అల్లర్లకు పాల్పడితే పోలీసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుందని హెచ్చరించారు ఐజీ రవి ప్రకాష్.. అమలాపురం ఎస్పీ కార్యాలయం నుండి కౌంటింగ్ పై ఏలూరు రేంజ్ పరిధిలోని అందరి ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు సూచనలు చేశామని రవి ప్రకాష్ తెలిపారు. కోనసీమ ప్రాంతం అల్లర్లలో మొదటి స్థానంలో ఉండటంతో మరింత పటిష్ట చర్యలు తీసుకున్నామని, అనపర్తి, పిఠాపురం, దెందులూరు, పెనమలూరు, మచిలీపట్నం తదితర నియోజకవర్గాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏదయినా సంఘటన జరిగితే క్విక్ రియాక్షన్ టీమ్స్ ఆ ప్రాంతానికి చేరుకుని చర్యలు తీసుకుంటారని రవి ప్రకాష్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు.