ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ కోసం ఇప్పటికే అన్ని టీమ్స్ తమ స్క్వాడ్‌లను ప్రకటించాయి. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు అధికారికంగా ఇంకా మూడు రోజుల గడువు ఉంది. అయితే ఈ ఐసీసీ ట్రోఫీలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా? లేదా? అనేది ఇంకా తెలియరావడం లేదు. స్క్వాడ్‌లో మార్పులు చేసుకొనేందుకు గడువు ముగుస్తున్నా.. బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ ఓ అంచనాకు రాలేకపోయింది. పేస్ గుర్రం ఫిట్‌నెస్‌పై బీసీసీఐ వెయిటింగ్ చేస్తోంది.
Also Read: Gold Rate Today: మగువలకు భారీ షాక్.. రూ.87 వేలు దాటిన బంగారం ధర!
ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు. ఎన్‌సీఏలో అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తున్న అతడిని బీసీసీఐ వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది. బుమ్రా ఇప్పటికే జిమ్ చేస్తున్నాడని, మరో రెండు రోజులు ఎన్‌సీఏలోనే ఉంటాడని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గతంలో హార్దిక్ పాండ్యా విషయంలో వ్యవహరించినట్లుగానే ఇప్పుడూ బుమ్రా ఫిట్‌నెస్‌పై బీసీసీఐ వేచి చూస్తోందని పేర్కొన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ట్రావెల్ రిజర్వ్‌లో యువ పేసర్ హర్షిత్ రాణా ఉన్నాడు. బుమ్రా స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకొనే అవకాశం కూడా లేకపోలేదు. మరో రెండు రోజుల్లో బుమ్రా ఫిట్‌నెస్‌పై పూర్తి స్పష్టత రానుంది.