Pilli Subhash Chandra Bose: తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతోందని, అది వాస్తవం కాదని వైసీపీ రాజ్యసభ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. మా రాజ్యసభ సభ్యులు ఇంకెవరూ రాజీనామా చేయడం లేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం ముందు నుంచి తాను జగన్ వెంట ఉన్నానని.. మంత్రి పదవి వుండగానే రాజీనామా చేసి జగన్ వెంట నడిచానని ఆయన పేర్కొన్నారు. తనపై ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారడం లేదని చాలా సార్లు చెప్పానని.. అయినా ఇలా చేస్తున్నారు.. బాధేస్తుందన్నారు. 2019లో ఓటమి పాలయినా జగన్ తను మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగే మనిషిని తాను కాదన్నారు.
Read Also: Andhra Pradesh: వైసీపీకి మరో షాక్.. ఇద్దరు ఎమ్మెల్సీలు గుడ్‌బై
ఆర్థికంగా తాను సంపన్నుడిని కాదు.. విధేయతతో మాత్రం సంపన్నుడిని అని చెప్పారు. తనపై ఏమైనా అనుమానం ఉంటే మీడియా నన్ను అడగాలని.. మీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని సూచించారు. నిన్న రాజీనామా చేసిన వాళ్ళకి పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందన్నారు. రాజకీయాల్లో నైతికత ఉండాలని పేర్కొ్న్నారు. పార్టీకి ఉన్న పదవిని కోల్పోయేలా చెయ్యడం పార్టీకి వెన్నుపోటు పొడవడమేనన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవికి రాజీనామా అంటే పార్టీని హత్య చెయ్యడమేనన్నారు. రాజీనామా చేసి వెళ్తున్నాం అని చెప్పడానికి వీలు లేదు.. పార్టీకి ఉన్న సభ్యత్వం కోల్పోయేలా చెయ్యడం నైతికత కాదన్నారు. రాజకీయాల్లో ఓటమి శాశ్వతం కాదు.. విడిపోతే పార్టీ నుంచి వెళ్లిపోవడం రాజకీయ లక్షణం కాదని వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే ఉంటానని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.