Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని.. కేవలం దానిని వ్యతిరేకించడమే కాదని.. పూర్తిగా తొలగించాలని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఎటువంటి కేసులను ఎదుర్కోడానికైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. తాను మళ్లీ మళ్లీ అదే చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే, తాను కుల విభేదాలను మాత్రమే ఖండించానని స్టాలిన్ అన్నారు. తాను హిందూ మతం మాత్రమే కాకుండా అన్ని మతాలను చేర్చానని, తాను కులమత భేదాలను ఖండిస్తూ మాట్లాడానన్నారు.
Also Read: Mamata Banerjee: మనం ప్రతి మతాన్ని గౌరవించాలి.. ఉదయనిధి వ్యాఖ్యలపై దీదీ స్పందన
తనపై ఎటువంటి కేసులను పెట్టిన ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు. పెరుగుతున్న ప్రతిపక్ష ఐక్యతపై భయంతో బీజేపీ తన మాటలను వక్రీకరించిందని ఆరోపించారు. సమస్యలపై ప్రజలను తప్పుదోవ పట్టించడానికే రాద్దాంతం చేస్తున్నారన్నారు. దేవుడు ఒక్కడనేది డీఎంకే విధానని మంత్రి పేర్కొన్నారు. తాను కేవలం సనాతన ధర్మాన్ని విమర్శించానని.. తన వ్యాఖ్యలను వక్రీకరించి బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. కాంగ్రెస్‌కు చెందిన రాహుల్‌గాంధీ, బీహార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని.. రాజకీయ నాయకులు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించాలన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడిని “ఉదయనిధి హిట్లర్” అని బీజేపీ సీనియర్ నాయకులు విమర్శిస్తుండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమిని హిందూ వ్యతిరేకం అని నిందిస్తు్న్న నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ తాజా వ్యాఖ్యలను చేశారు.
Also Read: China: కలవరపెడుతున్న హైకూయ్ తుపాను.. అనేక రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేత
ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌లు తీవ్రంగా మండిపడ్డారు. విద్వేషాన్ని వ్యాపింపజేస్తోందని, వచ్చే ఎన్నికల్లో హిందూ వ్యతిరేక వ్యూహాన్ని ఇండియా అనుసరించబోతుందా? అని ఉదయనిధి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై జేపీ నడ్డా పరోక్షంగా దాడి చేశారు. ‘గత రెండు రోజులుగా ఇండియా కూటమి ‘సనాతన ధర్మాన్ని’ అవమానిస్తోంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే డీఎంకే, కాంగ్రెస్ నేతలు ‘సనాతన ధర్మాన్ని’ అంతం చేయాలని మాట్లాడుతున్నారు. మన ‘సనాతన ధర్మాన్ని’ అవమానించడం ఇదే మొదటిసారి కాదు’ అని అమిత్ షా మండిపడ్డారు.ఉదయనిధి స్టాలిన్‌ను “హిట్లర్” అని పిలిచిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి ఇతర బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో, మంత్రి ప్రియాంక్ ఖర్గే స్టాలిన్‌కు మద్దతుగా “సమాన హక్కులను ఇవ్వని ఏ మతమైనా.. వ్యాధితో సమానం…” అని అన్నారు. ఇండియా కూటమిలో కీలక పార్టీ అయిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఉదయనిధి స్టాలిన్‌కు, డీఎంకేకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఒక వర్గం ప్రజలను బాధపెట్టే విషయంలో జోక్యం చేసుకోకూడదని మమతా బెనర్జీ అన్నారు.