Sharad Pawar: పార్లమెంట్ సంబంధిత వ్యవహారాలపై చర్చ చాలా ముఖ్యమని, కానీ రాను రాను ఈ సంప్రదాయం క్షీణిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. నూతన పార్లమెంటు భవనం గురించి రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని ఆయన అన్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో మహాత్మా గాంధీ మిషన్ యూనివర్సిటీలో నిర్వహించిన సౌహార్ద్ బైఠక్‌లో శరద్ పవార్ మాట్లాడారు. రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమేనని.. కానీ చర్చించి వాటిని ఏకాభిప్రాయం మీదుకి తీసుకురావాలని శరద్ పవార్ వివరించారు. గతంలోనూ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు జరిగేవని తెలిపారు.
Read Also: Viral Video: కేఎస్ భరత్తో అశ్విన్ రచ్చ.. తెలుగు నేర్పించాలంటూ ఓ పట్టుపట్టాడు.. వీడియో తెగ వైరల్
కొత్త పార్లమెంటు నిర్మించాల్సిన అవసరం ఏమిటో తనకు అర్థం కావడం లేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. దీనికి సంబంధించిన నిర్ణయం రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి తీసుకోవాల్సింది అని వివరించారు. తనకు ఈ విషయం న్యూస్ పేపర్ల ద్వారా తెలిసిందని పేర్కొన్నారు. ఆ నూతన పార్లమెంటు భవనాన్ని మే 28వ తేదీన ప్రారంభించారు. కాంగ్రెస్ దీన్ని పట్టాభిషేకంగా పేర్కొంటూ ప్రధాని మోడీపై విమర్శలు సంధించిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించాలని తాము డిమాండ్ చేశామని శరద్ పవార్ ఈ సందర్భంగా చెప్పారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాల్సిన అవసరమే లేదని తెలిపారు. పార్లమెంటు తొలి సమావేశం జరిగిన తర్వాత దిగిన ఓ ఫోటో వైరల్ అయిందని, అందులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సహా పలువురు నేతలు ఉన్నారని వివరించారు. అదే నూతన పార్లమెంటు ప్రారంభం తర్వాత బయటకు వచ్చిన ఫొటోలో కాషాయ దుస్తులు ధరించిన వారు ఉన్నారని తెలిపారు. ఎన్నికైన నేతలకు నూతన పార్లమెంటు భవనంలోకి తొలిగా ప్రవేశానికి అవకాశాలు ఇవ్వలేదని వివరించారు.