Real Estate Scam: మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్.. తమను మోసం చేశారని దాదాపు 700 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన కడుతున్న ఐ టవర్‌లో తాము ఇన్వెస్టర్లుగా ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది..? తాజాగా హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఐ టవర్ పేరుతో ఖాజాగూడలోని సర్వే నంబర్ 19 ప్రాంతంలో నిర్మితమవుతోంది. దాదాపు 80 శాతం బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. కానీ తాజాగా ఈ బిల్డింగ్ వివాదంలో చిక్కుకుంది. భూమి యజమాని.. బిల్డర్ మధ్యలో వచ్చిన విభేదాలకు ప్లాట్ల కొనుగోలుదారులు బలయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే..
Read Also:Akash Prime: వైమానిక రక్షణలో మరో అస్త్రం.. 15,000 అడుగుల ఎత్తులో ‘ఆకాశ్ ప్రైమ్’ విజయవంతం..!
మొత్తం 10 ఎకరాల్లో ఐ టవర్ నిర్మితమవుతోంది. ఈ 10 ఎకరాల భూమికి యజమాని మాజీ IAS అధికారి RP సింగ్. ఈయన ఐ టవర్ నిర్మాణం కోసం ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే జరిగింది. 80 శాతం నిర్మాణం పూర్తయింది. కానీ ఆ తర్వాత వచ్చిన విభేదాలతో ఇప్పుడు 672 మంది ఇన్వెస్టర్లు రోడ్డు మీద పడ్డారు. మొత్తం 10 ఎకరాల్లో 3 ఎకరాల 24 గుంటల భూమిని ఆర్పీ సింగ్.. తన కుమార్తె చేతన కౌర్ పేరిట గిఫ్ట్ డీడ్ చేశారు. ఆమె మృతి అనంతరం.. ఆమె భర్తకు తెలియకుండానే ఈ గిఫ్ట్ డీడ్‌ను ఆర్పీసింగ్ భార్య హరవిందర్ కౌర్ రద్దు చేశారు. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా భూమిని డెవలప్‌మెంట్‌కు అప్పగించారని బాధితులు చెబుతున్నారు. ఈ విషయాలు బ్యాంక్ లోన్ దరఖాస్తు సమయంలో వెలుగు చూశాయంటున్నారు. అందుకే దీనిపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
Read Also:Amaravati Land Pooling: రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు బ్రేక్..!
ఇప్పుడు బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలో వెనుకడుగేస్తుండటంతో, ఇన్వెస్టర్లు నెల నెలా ఈఎంఐలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వివాదానికి కేంద్ర బిందువైన RP సింగ్ ప్రస్తుతం CCS పోలీసుల కస్టడీలో ఉన్నారు. మరోవైపు ఐ టవర్స్ సంస్థ గతంలో ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. RP సింగ్ కుటుంబం దాచిన నిజాలు ఇప్పటివరకు వందలాది ఇన్వెస్టర్లకు నష్టాన్ని కలిగించాయంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.