హైదరాబాద్‌లో కబ్జారాయుళ్లు హడలెత్తిస్తున్నారు. ఖాళీ స్థలాల కనిపిస్తే చాలు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలాలను కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. అలాంటి ఓ గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. పేదలు, మధ్యతరగతి ఆస్తులే టార్గెట్‌గా కబ్జాలు చేస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలా ఆక్రమించేస్తున్నారు. విలువ పెరిగితే భూములు అమ్ముకుందామనుకున్న వాళ్లను నిలువునా ముంచేస్తున్నారు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనకంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉంటారు జనం. చాలామంది స్థలాలను కొనుక్కొని పెట్టుకుంటారు. ఎప్పుడైనా దానికి ధర పెరగబోతుందా?అప్పుడు అమ్ముకొందామనుకుంటారు. ముఖ్యంగా నిరుపేదలు, కొద్దిగా డబ్బు ఉన్నవాళ్లు ఎక్కువగా స్థలాల మీద పెట్టుబడి పెడుతున్నారు. ఆ తర్వాత ధర వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు.
ఐతే…అలాంటి ఖాళీ స్థలాలను ఇప్పుడు కబ్జారాయుళ్ల కన్నుపడింది. ఏకంగా వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్ముకుంటున్నారు. కీసర పక్కనే ఉన్న భువనగిరి, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న ఖాళీ స్థలాలు కనబడితే చాలు ఆక్రమిస్తున్నారు. వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారు. ఇలాంటి 20 మంది సభ్యుల ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా ఇప్పటివరకు చాలా ఖాళీ స్థలాలను అమ్మినట్లు తెలిపారు పోలీసులు.
ఇక…ఈ ముఠాలో కీలక వ్యక్తులు ముగ్గురు ఉన్నారు. కీసర, రాంపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ ప్రాంతాల్లో వీళ్లు తిరుగుతుంటారు. 500 గజాల లోపు ఉన్న చిన్న స్థలాలను టార్గెట్ చేస్తారు. ఆ స్థలాలు చాలా రోజులపాటు వీళ్లు అబ్జర్వ్ చేస్తారు. ఆ స్థలాలకు ఎవరూ రావడంలేదని గుర్తించిన తర్వాత నకిలీ పేపర్లను తయారు చేస్తారు. సంపంగి సురేష్, అరవింద్, హరిప్రసాద్ ఈ ముగ్గురి పేర్ల మీద పేపర్లను క్రియేట్ చేస్తారు. ముందుగా ఒకరి నుంచి ఒకరు ఆ ల్యాండ్‌ను కొనుగోలు చేసుకున్నట్లుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అందుకు సంబంధించిన అన్ని పత్రాలను కూడా వీళ్లే సొంతంగా తయారు చేసుకుంటారు. నకిలీ పత్రాలు తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమర్పిస్తారు. ఆ పేపర్లు చూసిన తర్వాత ఒకరు కొనుగోలుదారుగా…మరొకరు అమ్మకందారుగా ఉంటారు. కొనుగోలు, అమ్మకాలు జరిపే ఇద్దరు ఉన్న తర్వాత ప్లాట్‌ను ఇతరులకు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తారు.
ఐతే…ఇంతవరకు పని అయిపోయింది అనుకుంటే కుదరదు. మరో మూడు నెలల తర్వాత మరొక రిజిస్ట్రేషన్ చేస్తారు. మరొక నెల రోజుల తర్వాత మరో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇలా వెనువెంటనే మూడు రిజిస్ట్రేషన్‌లను పూర్తిచేసుకుంటారు. ఆరు నెలల కాలంలో ఆ ల్యాండ్‌ను పూర్తిస్థాయిలో వీరి పేరు మీదికి వచ్చేటట్టుగా మారిపోతుంది. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సదరు ఫ్లాట్ ఓనర్ గుర్తిస్తే దానిపై సమస్యలు ఉంటాయి. మూడుసార్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫ్లాట్ ఓనర్ వెళ్ళినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నేరుగా వెళ్లి ఆ ఫ్లాట్‌ను వీళ్లు కబ్జా చేస్తారు. నిజమైన ఫ్లాట్ ఓనర్ అక్కడికి చేరుకుంటే అతన్నే దబాయిస్తారు. మేం ఎప్పుడో కొనుగోలు చేశామని…ఈ ఫ్లాట్ మీద మీకు ఎలాంటి రైట్స్ లేవంటారు. ఈ ఫ్లాటు మేం వీళ్ల దగ్గర నుంచి కొనుగోలు చేసుకున్నామని చెప్పి పేపర్లను ముందు పెడతారు. వీటిని చూసి నిజమైన ఓనరు భయపడిపోతాడు. ఇలా ఇప్పటివరకు పదుల సంఖ్యలో ఫ్లాట్లను వీళ్ళు తమ పేర్లు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్ముకున్నారని తెలిపారు పోలీసులు.
కీసర, రాంపల్లి ప్రాంతం నుంచి పదేపదే ఇలాంటి కంప్లైంట్స్ రావడంతో రాచకొండ ఎస్ఓటి పోలీసులు గ్యాంగ్‌పై నిఘా పెట్టారు. మొత్తంగా 13 మందిని పట్టుకున్నారు. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. కబ్జా చేసి తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుని అమ్ముకుంటున్నారని అధికారులు నిర్ధారించారు. ఇలాంటి గ్యాంగ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు.