హైదరాబాద్‌లో పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. డ్రగ్ స్మగ్లర్లు తమ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చి.. ఇక్కడ వినియోగదారులకు సరఫరా చేసేవాళ్లు. కానీ ఇప్పుడు స్మగ్లర్లు పంథా మార్చారు. ఏకంగా హైదరాబాద్‌లోనే డ్రగ్స్ తయారీ మొదలు పెట్టారు. మొన్నటికి మొన్న ఉప్పల్ ప్రాంతంలో డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి భారీగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు.
హైదరాబాద్‌లో మరోసారి భారీగా మత్తు పదార్థాల ఉత్పత్తి జరుగుతున్నట్లు బయట పడింది. హైదరాబాద్ జీడిమెట్ల అంతా పారిశ్రామిక ప్రాంతం. అక్కడ ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశ్యంతో కొంత మంది ముఠాగా ఏర్పడి.. డ్రగ్స్ ఉత్పత్తి స్టార్ట్ చేశారు. కానీ పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేసి.. భారీగా ఎఫెడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు డ్రగ్ తయారీదారులను అరెస్ట్ చేశారు. వారిని వాస్తవయి శివరామకృష్ణ పరమవర్మ, డాంగేటి అనిల్, ముసిని దోరబాబు, మద్దు వెంకట కృష్ణరావుగా గుర్తించారు.
జీడిమెట్లలోని సాయి దత్త రెసిడెన్సీ, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో దాడి చేశారు ఈగల్ టీమ్ అధికారులు. డ్రగ్ తయారీ ముఠా నుంచి 220 కిలోల ఎఫెడ్రిన్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసిన డ్రగ్స్ విలువ దేశీయ మార్కెట్లో రూ.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రూ.72 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. ఈ కేసులో అరెస్టయిన వాస్తవయి శివరామకృష్ణ పరమవర్మ.. కాకినాడకు చెందిన వ్యక్తి. ఆక్వా కల్చర్ వ్యాపారిగా ఉన్నారు. మరో నిందితుడు డాంగేటి అనిల్ కూడా కాకినాడకు చెందిన వ్యక్తి. జీడిమెట్లలోని పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్నాడు. అటు మరో నిందితుడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముసిని దోరబాబు.. జీడిమెట్లలోని విఘ్నసాయి ల్యాబొరేటరీస్‌లో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మద్దు వెంకట కృష్ణరావు పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ డైరెక్టర్‌గా ఉన్నాడు. అదే కంపెనీకి చెంది మరో డైరెక్టర్ ప్రసాద్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఈగల్ టీమ్ పోలీసులు గుర్తించారు.
ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న శివరామకృష్ణ పరమవర్మ గతంలో 2 సార్లు డ్రగ్ కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. 2017లో బెంగళూరులో, 2019లో హైదరాబాద్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆ సమయంలో 250 కిలోల యాంఫిటమైన్, 10 కిలోల ఆల్ప్రాజోలమ్ స్వాధీనం చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఇక డాంగేటి అనిల్, దోరబాబు, వెంకట కృష్ణరావు, ప్రసాద్‌కు రసాయన పరిశ్రమల్లో పని చేస్తూ మత్తు పదార్థాల తయారీకి కావలసిన రసాయన పరిజ్ఞానం కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: Gonda Girl Record: 8 నిమిషాల్లో 240 పుషప్స్, గంటలో 10 కిలోమీటర్లు.. రికార్డ్స్‌లోకి ఆరేళ్ల చిన్నారి!
2024 డిసెంబర్‌లో శివరామకృష్ణ పరమవర్మ, అనిల్‌ను పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీలో కలిశాడు. అనంతరం ఇద్దరూ మద్యం షాప్ వద్ద సమావేశమై ఎఫెడ్రిన్ తయారీపై చర్చించారు. అనిల్ సూచన మేరకు కంపెనీ యజమానులు వెంకట కృష్ణరావు, ప్రసాద్‌ను ఈ పనిలోకి లాగారు. శివరామకృష్ణ రూ.8 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేసి, టోలోయిన్, బ్రోమిన్, అసిటోన్ వంటి రసాయనాలు సరఫరా చేశాడు. అనిల్ మరిన్ని రా మెటీరియల్ కొనుగోలు చేసి తయారీ ప్రారంభించాడు. మూడవ దశ ప్రాసెసింగ్ తర్వాత 220 కిలోల ఎఫెడ్రిన్ సిద్ధమైంది. ఈ డ్రగ్‌ను జీడిమెట్లలోని సాయి దత్త రెసిడెన్సీలో దాచిపెట్టారు. నిందితుల కదలికలపై ఈగిల్ బృందం గమనిస్తుండగా.. అక్టోబర్ 9న వారు ఒకే చోట సమావేశమయ్యారు. దాంతో సిబ్బంది దాడి చేసి ఒకేసారి నలుగురిని అరెస్ట్ చేశారు. ఫ్లాట్‌లో 220 కిలోల అధిక నాణ్యత గల ఎఫెడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు డ్రగ్ తయారీలో ఉపయోగించిన పీఎన్‌ఎమ్ లైఫ్ సైన్సెస్ యూనిట్‌ను అధికారులు సీజ్ చేశారు. ఈ సంస్థకు లీజ్ పత్రాలు, బోర్డు మీటింగ్ మినిట్స్, బ్యాంకు లావాదేవీలు లాంటి రికార్డులు లేవని విచారణలో తేలింది. ఎఫెడ్రిన్ అత్యంత వ్యసనపరమైన మత్తు పదార్థమని పోలీసులు చెబుతున్నారు. దీన్ని తరచుగా వాడితే ఆందోళన, నిద్రలేమి, తలనొప్పి, వాంతులు, ఆకలి కోల్పోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీని నుంచి తయారయ్యే మెతాంఫిటమైన్ ధర 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు.