ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా ఇటియాథోక్‌లోని భిఖంపూర్వా బ్లాక్‌కు చెందిన 6 ఏళ్ల బాలిక అనామిక మిశ్రా అథ్లెట్లు కూడా కష్టంగా భావించే అరుదైన ఘనతను సాధించింది. అనామిక ఆరేళ్ల వయసులో ఒక గంటలో 10 కిలోమీటర్ల పరుగును ఆగకుండా పూర్తి చేసింది. అంతేకాదు ఎనిమిది నిమిషాల్లో 240 పుషప్స్ పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. యోగా, పరుగు, వెయిట్ లిఫ్టింగ్ ద్వారా ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన అనామిక.. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడమే తన లక్ష్యం అని చెబుతోంది. వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకం సాధించి దేశానికి, జిల్లాకు పేరు తీసుకురావాలనేది తన కల అని అనామిక తెలిపింది.
భిఖంపూర్వా ప్రాథమిక పాఠశాలలో అనామిక మిశ్రా 1వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి ఒక ఉపాధ్యాయుడు, తల్లి గృహిణి. తల్లిదండ్రులు ఇద్దరు ఆమెకు అండగా నిలుస్తున్నారు. అనామిక గత రెండు సంవత్సరాలుగా పరుగెడుతోంది. అక్టోబర్ 2న ఒక గంటలో ఆగకుండా 10 కిలోమీటర్లు పరుగెత్తింది. ఇదే ఆ చిన్నారి బెస్ట్ రన్. తాను బయటి ఫుడ్ అస్సలు తిననని అనామిక చెబుతోంది. ఉదయం మొలకలు, తాజా పండ్లు తింటుందట. మధ్యాహ్నం తేలికపాటి భోజనం చేస్తా అని చెబుతోంది. యూట్యూబ్‌లో ఒక అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను అనామిక చూసింది. ఆ వీడియోను తన తండ్రికి చూపించగా.. ప్రోత్సహించాడు. తండ్రి ప్రోత్సాహంతో యోగా, వెయిట్ లిఫ్టింగ్, పరుగును మొదలెట్టింది. ఈ ప్రక్రియ గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతోంది.
Also Read: IND vs SA: కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న రిచా ఘోష్.. దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?
అనామిక తండ్రి, గురువు మనోజ్ మిశ్రా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ… ‘అనామిక ఎనిమిది నిమిషాల్లో 240 పుషప్స్ పూర్తి చేయడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అనామిక క్రీడలతో పాటు చదువులోనూ ముందే ఉంది. ఇంత చిన్న వయస్సులో గొప్పగా ఆలోచిస్తుంది. బయట ఫుడ్ తినకపోవడమే కాదు పార్టీలకు కూడా హాజరు కావడం లేదు. ఓ తండ్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అనామిక గొప్ప స్థాయికి చేరుకుంటుందనే నమ్మకం ఉంది’ అని ధీమా వ్యక్తం చేశాడు. ఒలింపిక్స్‌లో పక్కాగా బంగారు పతకం సాధిస్తావ్ తల్లి అని అందరూ ప్రశంసిస్తున్నారు.