ఎవరైనా దొంగలు ఇళ్లు దోచుకుంటారు.. ఏటీఎంలపై కన్నేస్తారు.. లేదంటే జ్యువెల్లరీ దుకాణాలపై నిఘా పెడతారు. హైదరాబాద్‌లో కొంత మంది దుండగులు వెరైటీ చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల్లో దుండగులు చేసిన చోరీ చూసి జనం అవాక్కవుతున్నారు. మోండా మార్కెట్లో జరిగిన ఈ దొంగతనం ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. ఇంతకీ ఆ దొంగలు ఏం చేశారు?.
ఆవును దొంగతనం చేసిన ఘటన సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో జరిగింది. దానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అర్థరాత్రి పూట ఖరీదైన కార్లలో కొంత మంది యువకులు వచ్చారు. ఆవులకు మత్తు మందు కలిపిన ఆహార పదార్థాలు తినిపించారు. అవి సృహ కోల్పోయిన తర్వాత వాటిని ఆయా కార్లలో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
నిజానికి ఇలాంటి ఘటనలు మోండా మార్కెట్లో తరచుగా జరుగుతున్నాయి. కానీ ఆవులు ఎక్కడికో వెళ్లిపోయాయని స్థానికులు భావిస్తున్నారు. సీసీ పుటేజీలు పరిశీలించిన తర్వాత జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆవులను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీలను పరిశీలించారు.
మోండా మార్కెట్ సహా సిటీలోని సీసీ ఫుటేజీలన్నీ పరిశీలిస్తున్నారు పోలీసులు. మొత్తంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు 10 టీమ్స్ ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీల ద్వారా అనుమానితుల్ని గుర్తించినట్లు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి కేసులు నమోదయ్యాయని.. 2024లో 18 మంది గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అప్పట్లో ఇలా పశువులను దొంగతనం చేసింది అయూబ్ గ్యాంగ్ అని చెప్పిన పోలీసులు.. ప్రస్తుతం అతడు జైలులో ఉన్నాడని తెలిపారు. ఇది మరో గ్యాంగ్ పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. అంతే కాదు.. కార్లను మోడిఫై చేసి ఇలాంటి దొంగతనాలకే వాడుతారని చెబుతున్నారు.
ఏది ఏమైనా నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. మరోవైపు పశువుల దొంగతనంపై మాత్రం స్థానికులు సీరియస్ అవుతున్నారు. నిందితులను త్వరగా పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.