ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బర్డ్ ఫ్లూ’ భయాందోళన కలిగిస్తోంది. కోళ్లకు వైరస్ సోకి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండటంతో.. జనాలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి. అయినా చికెన్ అమ్మకాలపై బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ భారీగా పడింది. బర్డ్ ఫ్లూపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సగానికి పైగా చికెన్ అమ్మకాలు తగ్గాయి.
హైదరాబాద్‌లో నిత్యం దాదాపుగా 6 లక్షల కిలోల చికెన్ సేల్ అవుతుంది. గత 2-3 రోజులుగా 50 శాతం కూడా సేల్స్ లేవని వ్యాపారులు అంటున్నారు. గిరాకీ లేక చికెన్ దుకాణాలు ఖాళీగా మారాయి. దానికి తోడు రోజూ నగరంలో అక్కడక్కడ కుళ్లిన చికెన్ నిల్వలు బయటపడుతున్నాయి. దాంతో చికెన్ ముట్టుకోవడానికి నగర వాసులు జంకుతున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా చికెన్ మెనూ ఆర్డర్లు పూర్తిగా తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్‌కు బదులుగా.. మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మటన్, చేపలకు భారీగా గిరాకీ పెరిగింది.
పటాన్ చెరువులోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్స్టా హాట్ ఫుడ్స్, రాజ్ కుమార్ రోలర్ ఫ్లోర్ మిల్స్ లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అధికారులు గుర్తించారు. గడువు ముగిసిన మెంతులు, ఆవాలు వాడుతున్నట్లు తేల్చారు. ప్రాసెసింగ్ యూనిట్లో బొద్దింకలు, పురుగులు ఉన్నాయని అధికారులు తెలిపారు. అపరిశుభ్రంగా ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులు కుళ్లిపోయిన కూరగాయలు వాడుతున్నట్లు పేర్కొన్నారు. ఫుడ్ ఐటమ్స్ తో పాటు సిమెంట్‌ను పక్క పక్కనే నిర్వాహకులు స్టోర్ చేశారు. ఇన్స్టా హాట్ ఫుడ్స్ ‘ఇండిగో ఎయిర్ లైన్స్’కి ఫుడ్ సప్లై చేస్తున్నారు.