హుజురాబాద్‌లో గెలుపు బీజేపీకి అవసరం… ఈటల రాజేందర్‌కి అత్యవసరం. ఈటల దశాబ్ధాల రాజకీయ భవిష్యత్ ఈ ఎన్నికతో ముడిపడి ఉంది. దుబ్బాకలో గెలిచిన తర్వాత.. బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉప ఎన్నిక హుజురాబాద్. టీఆర్‌ఎస్‌కు ధీటుగా, పోటీగా బీజేపీ కూడా చతురంగ బలగాలను మోహరించింది. బీజేపీ ప్రచారానికి ఫలితం దక్కుతుందా?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలనే కసితో ఉంది కమలదళం. దుబ్బాక పోరులో విజయం సాధించడం, గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చూపించడంతో.. కమలంపార్టీ నేతల్లో కసి రోజురోజుకీ పెరుగుతోంది. ఈటల పార్టీలో చేరడంతో హుజురాబాద్‌లో బీజేపీకి పోరాడేందుకు బలమైన అస్త్రం దొరికినట్లైంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ బీజేపీ బలంగా లేదు. గత ఎన్నికల్లో బీజేపీ కంటే నోటాకు ఓట్లు ఎక్కువగా వచ్చాయి.
ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.. ఆయన ఏ పార్టీలో చేరతారనే దానిపై క్లారిటీ రాలేదు. కొన్ని రోజుల ఊగిసలాట తర్వాత.. ఆయన బీజేపీలో చేరడంతో.. కాషాయదళం హుజురాబాద్‌లో దిగింది. ఈటలకు సొంతంగా ఉన్న బలాన్ని కాపాడుకోవడంతో పాటు.. దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న ఎన్నికల వ్యూహాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తూ వచ్చారు పార్టీ నేతలు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలను యాక్టివేట్ చేయడం.. వారిని ఇంటింటికీ తిప్పడం అనే స్ట్రాటజీని అమలు చేశారు.
బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలను ఇంచార్జ్‌లుగా నియమించింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కి పార్టీ నియోజక వర్గ బాధ్యతలు అప్పగించింది. నియోజకవర్గం లోని మండలాల కు ఇంచార్జ్ లను పెట్టింది. ఆ తరవాత బూత్ ఇంచార్జ్ లను, శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌లను ఏర్పాటు చేసారు. ఈ నేతలంతా ప్రచారం ముగిసే దాకా హుజూరాబాద్ లోనే మకాం వేశారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాద యాత్రలో ఉన్నా.. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లంతా ఇక్కడే ఉన్నారు. షెడ్యూల్ వచ్చాక ప్రతి మండలానికి మూడు శక్తి కేంద్రాలు సరాసరి 9 పోలింగ్ బూత్ లను అప్పగించింది.
గతంలో నాయకులు ఉప ఎన్నికల ప్రచారం అంటే ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో 5రోజులు ప్రచారం చేశారంటే బీజేపీ ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణకు చెందిన వారితో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారంలో బాగంగా.. ఎక్కువగా అధికార పార్టీని టార్గెట్ చేసింది బీజేపీ నాయకత్వం. కేసీఆర్ పాలనతో పాటు వారసత్వ రాజకీయాలను ప్రజల ముందు నిలబెట్టింది. దళిత బందు స్కీమ్ కూడా ఎన్నికల కోసమే అంటూ ఆరోపించారు పార్టీ నాయకులు.
ఈటలకు స్థానికంగా ఉన్న బలం కావచ్చు, బీజేపీ అమలు చేసిన ఎలక్షన్ వ్యూహం కావచ్చు.. గెలుపు మీద గట్టి నమ్మకంతో ఉన్నారు కమలనాథులు. ప్రచార సమయంలో ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారని అంటున్నారు. తమ అభ్యర్థి చేసిన పనులు ప్రజలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు తమకు కలిసి వస్తాయంటున్నారు బీజేపీ నేతలు. ఆత్మగౌరవం కోసం అధికారం వదులుకున్న ఈటలపై ప్రజల్లో సానుభూతి ఉందని.. అది ఓట్లుగా మారుతుందనేది కమలనాథుల ఆశ.