తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక.. ప్రత్యక్షంగా ఇంటర్ విద్యార్థులపై ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ఇంటర్ బోర్డు పరీక్షల నిర్వహణకు ఎంచుకున్న జూనియర్ కాలేజీలు.. ఇక్కడే ఉండటం సమస్యకు కారణమైంది. నియోజకవర్గంలోని జమ్మికుంట, హుజూరాబాద్ మండలాల్లోనే నాలుగు పరీక్షా కేంద్రాలున్నాయి. దీంతో ఏంచేయాలో పాలుపోక జిల్లా విద్యాశాఖ అధికారులు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకు లేఖరాశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఆటంకాలు లేనప్పటికీ.. హుజూరాబాద్ నియోజవర్గంలో నాలుగు ప్రభుత్వ జూనియర్ కాలేజీలను పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వం ఎంచుకుంది.
ఇందులో హుజూరాబాద్లో రెండు, జమ్మికుంటలో రెండు ఉన్నాయి. ఆ నాలుగు చోట్లా పరీక్ష కేంద్రాలు మార్చాలా? లేక పరీక్షను.. పోలింగ్‌కు ముందు లేదా ఆ తరువాత రోజుకు వాయిదా వేయాలా? అన్న విషయంలో స్పష్టత ఇవ్వాలని లేఖలో కోరారు అధికారులు. అక్టోబరు 30న హుజురాబాద్ ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు ముందు 29, 30 తేదీల్లో 144 సెక్షన్ విధిస్తారు. అయితే సెప్టెంబరు 24నే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలు కానున్నాయి.
షెడ్యూల్ ప్రకారం 29 తేదీన ఫిజిక్స్, ఎకనామిక్స్, 30వ తేదీన కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరగాల్సి ఉంది. దీంతో పరీక్ష నిర్వహణ దాదాపుగా సాధ్యం కాదు.ఈ పరిస్థితుల్లో జిల్లా విద్యాశాఖాధికారుల ముందు … ఆ తేదీన జరిగే పరీక్షలను వాయిదా వేయడం లేదా సెంటర్లను తరలించడం.. అనే రెండు ఆప్షన్సే ఉన్నాయి. అయితే, బోర్డు సమాధానం.. రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాయబోతున్న దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేయనుంది.