Cash Prize for Hockey India Team: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత్ కాంస్యం గెలుచుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ భారత హాకీ జట్టు కాంస్య పతకం సాధించడంతో ప్లేయర్లకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. టీమ్ ఆటగాళ్లలో ఒక్కొక్కరికి రూ. 15 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 7.5 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ ఓ ప్రకటనలో తెలిపారు.
‘భారత హాకీ జట్టు కఠిన శ్రమ, నిబద్ధతకు ఈ విజయం నిదర్శనం. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కష్టంతో ఈ పతకం దక్కింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌ల్లోనూ పతకం గెలవడం అద్భుతం. ప్రపంచ వేదికపై భారత హాకీ పునర్జీవాన్ని ప్రతిబింబిస్తుంది. భారత జట్టు సాధించిన దానికి ఈ నజరానా సరితూగదు. కానీ ప్రోత్సాహకం ఇవ్వడం ముఖ్యం. ఆర్‌పీ శ్రీజేష్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అతడి వారసత్వం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది’ అని హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ పేర్కొన్నారు.
Also Read: Neeraj Chopra: నేను వందశాతం కష్టపడ్డా.. ఇది అర్షద్ డే: నీరజ్ చోప్రా
స్పెయిన్‌పై చివరి మ్యాచ్ ఆడి అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన ఆర్‌పీ శ్రీజేశ్.. భారత్ గెలిచిన అనంతరం ఉద్వేగానికి గురయ్యాడు. ఆనందంతో గోల్ పోస్టు ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ అతడిని తన భుజాలపై ఎత్తుకుని మైదానంలో తిరిగాడు. 1968, 1972లో భారత్ కాంస్య పతకాలు గెలుచుకుంది. 52 ఏళ్ల తర్వాత వరుసగా (2020, 2024) రెండు కాంస్య పతకాలు దక్కించుకుంది.