Soaps Prices: ధరల భారంతో అల్లాడుతున్న సామాన్యులకు ఊరట లభించింది. సబ్బులు, డిటర్జెంట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటించింది. ప్రొడక్ట్ బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. ముడిసరకు ధరలు అదుపులోకి రావడంతో ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హిందూస్థాన్ యూనిలీవర్ విక్రయిస్తున్న సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 500 మిల్లీలీటర్ల ధర ప్రస్తుతం రూ.115 ఉండగా రూ.3 తగ్గనుంది. దీంతో వినియోగదారులకు రూ.112కే లభించనుంది. అటు రిన్ డిటర్జెంట్ కిలో పౌడర్ ధర రూ.103 నుంచి రూ.99కి తగ్గనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
Read Also: Adipurush: మరో కొత్త వివాదంలో ఆదిపురుష్.. ఢిల్లీ కోర్టులో పిటిషన్
హెచ్‌యూఎల్ తయారుచేసే 50 గ్రామలు డబ్ సబ్బు ధర రూ.27 నుంచి రూ.22కి తగ్గనుంది. లైఫ్‌బాయ్ 125 గ్రాముల 4 సోప్‌ల ప్యాక్ ధర రూ.140 నుంచి రూ.132కి తగ్గనుంది. తగ్గించిన ధరల ఉత్పత్తులు 15 రోజుల తర్వాతే మార్కెట్‌లోకి వస్తాయని కంపెనీకి చెందిన డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. మరోవైపు గోద్రెజ్ కంపెనీ కూడా తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. గోద్రెజ్ నంబర్ వన్ సబ్బుల ప్యాక్ ధర రూ.140 నుంచి రూ.120కి తగ్గనుంది. ఇప్పటివరకు రూ.10కి లభించే నంబర్ వన్ సబ్బు బరువు 41 గ్రాములు ఉండగా దానిని 50 గ్రాములకు పెంచుతున్నట్లు గోద్రెజ్ కంపెనీ తెలిపింది.