కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ అస్సాంలో కొనసాగుతుంది. కాగా.. ఈ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో గుహవాటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 500 మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం ఉదయం గుహవాటి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాగా.. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి.. నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, బారికేడ్లను దాటుకుని రావడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలో రాహుల్ గాంధీ అక్కడే ఉన్నారు.
అయితే ఈ ఘటనపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డీజీపీని ఆదేశించారు. ఘర్షణలు జరిగేలా కార్యకర్తలను రెచ్చగొట్టినందుకు కేసు ఫైల్ చేయాలని తెలిపారు. కాంగ్రెస్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను సాక్ష్యాలుగా పరిగణించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా.. గుహవాటి రోడ్లపై కాంగ్రెస్ యాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పింది. వర్కింగ్ డే రోజు కావడంతో కీలక నగరమైన రహదారులపై యాత్రను అనుమతించడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలిపింది. ఈ రోడ్డులో బదులు అస్సాం దిశగా జాతీయ రహదారి మార్గంలో చేపట్టాలని సూచించింది.
ఈ ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో భజరంగ్ దళ్ ఇదే మార్గంలో నడిచిందని, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడ ఇదే రూట్‌లో ర్యాలీ చేశారని అన్నారు. అప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఏంటని ప్రశ్నించారు. ‘మేము బారికేడ్లను బద్దలు కొట్టి ఉండవచ్చు, కానీ చట్టాన్ని ఉల్లంఘించలేదు’. అని తెలిపారు. తమను బలహీనులుగా భావించవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల శక్తికి నిదర్శనమన్నారు. అస్సాం ప్రభుత్వం ప్రజలను అణచివేస్తోందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర ఉదయం 10 గంటలకు క్వీన్స్ హోటల్ నుండి ప్రారంభమైంది. రాహుల్ గాంధీ గౌహతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. మేఘాలయలోని రి భోయ్ జిల్లాలోని జోరాబత్‌లోని ఓ హోటల్‌లో ఈశాన్య కాంగ్రెస్ కమిటీ నేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. అనంతరం గౌహతిలో విద్యార్థులు, పౌరసమాజ సభ్యులతో మాట్లాడనున్నారు. ఇక.. రాహుల్ యాత్ర అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ మేర జనవరి 25 వరకు కొనసాగనుంది.