High Tension at Palnadu: ఏపీలో ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. సాయంత్రం వరగ్గా ప్రశాంతంగా జరిగిన పోలింగ్.. 5 గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు గ్రూపులుగా విడిపోయిన టీడీపీ, వైసీపీ శ్రేణులు నాటుబాంబులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా.. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అనిపించినా.. కాసేపటికే మళ్లీ అల్లర్లు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. పల్నాడు జిల్లాలో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గురజాల నియోజకవర్గం మాచవరం మండలం కొత్త గణేశుని పాడులో వైసీపీ, టీడీపీ వర్గాలకు మధ్య చెలరేగిన వివాదం రాత్రి నుంచి కొనసాగుతూనే ఉంది.
Read Also: Ambati Rambabu: పల్నాడులో ఇంతటి అరాచకమా.. అక్కడ రీపోలింగ్ జరగాల్సిందే..
నిన్న పోలింగ్ పూర్తయిన తర్వాత టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో, వైసీపీ శ్రేణులు గ్రామం నుంచి బయటికి వెళ్లిపోయి నరసరావుపేట చేరుకున్నారు. జరిగిన విషయాన్ని చెప్పేందుకు వైసీపీ నాయకులను ఆశ్రయించారు. దీంతో కాసు మహేష్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు తమ కార్యకర్తను వెంటబెట్టుకొని, కొత్త గణేశుని పాడు తీసుకొని వెళ్లారు. అయితే అక్కడ కూడా వైసీపీ శ్రేణులకు ఎదురుదెబ్బ తగిలింది. గ్రామంలోకి ఎందుకు వచ్చారు అంటూ కొంతమంది, రాళ్లు కర్రలతో వెంబడించడంతో వైసీపీ శ్రేణులు చెల్లా చెదురయ్యారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని, అనిల్ కుమార్ యాదవ్‌ను , కాసు మహేష్ రెడ్డిని ఆ గ్రామం నుంచి పక్కకు తీసుకువెళ్లిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు.. అదుపుతప్పిన పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు పల్నాడులో ఆంక్షలు కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.