High Court: హైకోర్టు ముందు విచారణకు హాజరు కావాలంటూ సీఆర్‌డీఏ కమిషనర్‌కి ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. జూన్ 20వ తేదీన హాజరు కావాలని పేర్కొంది న్యాయస్థానం.. హైకోర్టుకు వెళ్లే దారిలో కనీస వసతులు కల్పించలేదని దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ రోజు కోర్టుకు రావాలని కమిషనర్ కి గతంలోనే ఆదేశాలు ఇచ్చింది.. అయితే, కర్ణాటక ఎన్నికల విధుల్లో ఉన్న కారణంగా హాజరు కాలేక పోతున్నట్టు హైకోర్టుకు తెలిపారు సీఆర్‌డీఏ కమిషనర్.. ఇదే సమయంలో.. కోర్టుకు వెళ్లే మార్గంలో జరుగుతున్న పనుల క్రమాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సీఆర్‌డీఏ కమిషనర్ తరపు న్యాయవాది.. ఇక, జూన్ 20వ తేదీన కోర్టు ముందు హాజరు కావాలంటూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Read Also: YS Viveka Case: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. అవినాష్‌రెడ్డికి నిరాశ..!
కాగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఆర్డీఏ కమిషనర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి హైకోర్టుకు చేరుకునే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇతర రోడ్లలో వీధి లైట్ల వ్యవహారంపై సీరియస్ అయ్యింది. తాము లైట్లు ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ స్వయంగా హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని గతంలో ఆదేశించిన విషయం విదితమే. ఇప్పుడు మరోసారి హాజరుకావాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది.