విద్య నికేతన్ సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి వైఖరి వల్లే తమ ఇంట్లో వివాదాలు పెరుగుతున్నాయని సినీ నటుడు మంచు మనోజ్ అన్నారు. నాన్న (మోహన్ బాబు) గారికి అన్ని విషయాలు తెలియదని, వినయ్ గురించి ఆయనకు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. మా అమ్మ ఆసుపత్రిలో లేరని, ఇంట్లోనే ఉన్నారని మనోజ్ తెలిపారు. కూర్చొని సామరస్యంగా సమస్య పరిష్కరించుకునేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. తిరుపతి గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలని నాన్న స్కూల్‌ను అక్కడ పెట్టారని చెప్పారు.
రాచకొండ సీపీ కార్యాలయంలో మంచు మనోజ్ విచారణ ముగిసింది. పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గంటన్నర పాటు మనోజ్‌ను ప్రశ్నించి వివరణ తీసుకున్నారు. అనంతరం మనోజ్ మాట్లాడుతూ… ‘నాకు న్యాయం జరుగుతుందని పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉంది. పోలీస్ వారు నాకు హామీ ఇచ్చారు. మేము అందరం సామరస్యంగా సమస్య పరిష్కరించుకుంటాము. ఎక్కువగా మా ఇంటివద్ద పబ్లిక్ గ్యాదరింగ్ ఉండకూడని పోలీసులు సూచించారు. సమస్య పరిష్కారం అయితే అందరికీ సంతోషం. మా అన్న మంచు విష్ణు ప్రోత్బలంతో ఇదంతా జరుగుతుంది. మా అమ్మ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి, అది అవాస్తవం. చంద్రగిరి పెద ప్రజల కోసం నేను పోరాడుతున్నా. వినయ్ అనే వ్యక్తి విద్య నికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నాడు. నేను మా నాన్న గారికి చెబుతున్నా పట్టించుకోవడం లేదు. నాన్న గారికి ఇవన్నీ విషయాలు తెలియదు. నేను ఫిర్యాదులో పేర్కొన్న విజయ్, కిరణ్ అనే వ్యక్తులని పోలీసులు పట్టుకుని దర్యాప్తు చేస్తున్నారు’ అని తెలిపారు.