Hemant Soren: మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు బుధవారం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధృవా పోలీసు స్టేషన్‌లో సీఎం హేమంత్ సోరెన్ ఫిర్యాదు చేసినట్లు రాంచీ పోలీసులు తెలిపారు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మళ్లీ ఈడీ సమన్లు.. ఎల్లుండి రావాలని నోటీస్
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను బుధవారం రాంచీలోని అతని నివాసంలో దర్యాప్తు ఏజెన్సీ అధికారులు విచారించిన నేపథ్యంలో ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 10 రోజుల వ్యవధిలో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించడం ఇది రెండోసారి. ఈ కేసుకు సంబంధించి గతంలో జనవరి 20న అతడిని విచారించారు. మరోవైపు మనీలాండరింగ్ కేసులో సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన ఈడీ.. విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు. ఈ నేపథ్యంలో సోరెన్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు, రాంచీలో సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించే ముందు అధికార జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ శాసనసభ్యులు బుధవారం హేమంత్ సోరెన్ నివాసంలో సమావేశమయ్యారు.