డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది.
ప్రస్తుతం.. మిచౌంగ్ తుపాను నైరుతి బంగాళాఖాతంలో ఉందని ఐఎండీ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతోందని.. మంగళవారం మధ్యాహ్నానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తుపాన్ ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరు నిలిచిపోవడంతో సర్వీసులు నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం 9 గంటల వరకు రన్‌వేను మూసివేశారు. బయటి నుంచి వచ్చే విమానాలను బెంగళూరుకు మళ్లిస్తున్నారు. అటు.. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌లపై నుంచి నీరు చేరింది. ఇప్పటి వరకు 204 రైళ్లు, 70 విమానాలు రద్దు అయ్యాయి. అంతేకాకుండా.. రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. నివాస ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పదుల సంఖ్యలో కార్లు తేలుతూ కనిపించాయి. దీంతో.. రాష్ట్రంలో SDRF, NDRF బృందాలు మోహరించాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా రోడ్లపై 3 నుంచి 4 అడుగుల మేర నీరు నిలిచింది.
YS Raja Reddy: షర్మిలక్కకు కాబోయే కోడలు.. హీరోయిన్ లెక్క ఉందే..?
ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8:30 గంటల వరకు చెన్నైలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో 20 నుంచి 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణ శాఖ (IMD) ప్రకారం, 70-80 సంవత్సరాలలో చెన్నై నగరంలో ఇలాంటి వర్షం కురువడం ఇదే మొదటిసారి తెలిపింది. తమిళనాడులో నిత్యావసర సేవలు మినహా సోమ, మంగళవారాల్లో సెలవు ప్రకటించారు. మరోవైపు.. NDRF 9 బృందాలు, SDRF 14 బృందాలు ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర జిల్లాలలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి అధికారులు కోస్తా జిల్లాల్లో దాదాపు 5,000 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం రాత్రి భద్రతా చర్యలను సమీక్షించారు. పరిస్థితిని సీఎం దగ్గరుండి చూసుకుంటున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం ఎంకే స్టాలిన్‌తో మాట్లాడారు. తుపాను వల్ల జరిగిన నష్టాన్ని ఆదుకుంటామని సీఎం స్టాలిన్‌కు హోంమంత్రి హామీ ఇచ్చారు.
మిచౌంగ్ తుపాను మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు-మచిలీపట్నం తీరాల మధ్య తీరాన్ని తాకనుంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 90-100 కి.మీ నుండి గంటకు 110 కి.మీ వరకు ఉంటుంది. రెస్క్యూ ఆపరేషన్ కోసం 12 ఎన్డిఆర్ఎఫ్ బృందాలను ఇక్కడ మోహరించారు. ముందుజాగ్రత్త చర్యగా డిసెంబర్ 5వ తేదీన పాఠశాలలు, కళాశాలలు ప్రకటించారు. అంతేకాకుండా.. తుపాను కారణంగా ఒడిశాలోని 5 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. డిసెంబర్ 6 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మల్కన్‌గిరి, కోరాపుట్, రాయగడ, గజపతి, గంజాం జిల్లాల్లో డిసెంబర్ 4, 5 తేదీల్లో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అటు.. తుపాను దృష్ట్యా పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అలర్ట్ ప్రకటించింది. పుదుచ్చేరిలోని సముద్ర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. డిసెంబర్ 3వ తేదీ రాత్రి 7 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తీర ప్రాంతాలకు వెళ్లవద్దని IMD ప్రజలను ఆదేశించింది.