Hyderabad Rains: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ అప్డేట్ వచ్చిన కొన్ని గంటల్లోనే పలు ప్రాంతాల్లో వర్షం కురిస్తోంది. ఎల్బినగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. హయత్ నగర్‌లో విజయవాడ జాతీయ రహదారిపై వరద నీరు భారీగా చేరింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మోకాళ్ళ లోతు నీరు రావడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అటువైపుగా వెళ్లే వాహనదారులు జాగ్రత్తలు పాటించండి. రోడ్లపై మ్యాన్‌హోల్స్, గుంతలు గమనిస్తూ నెమ్మదిగా వెళ్లండి.
READ MORE: Hyderabad: డ్రైనేజీలో పడిపోయిన బాలిక.. తృటిలో తప్పిన ప్రమాదం
మరోవైపు.. మెదక్ జిల్లా కేంద్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ అకాల వర్షం స్థానికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టించింది. గత కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే, మెదక్‌లో మరో భారీ వర్షం సంభవించింది. దీంతో ఇప్పటికే నీటిలో ఉన్న అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మరింతగా మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షం కారణంగా మెదక్-హైదరాబాద్ నేషనల్ హైవేపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణం వెల్ కం బోర్డు వద్ద భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ముందుకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.