AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడూ స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షిస్తున్నారు. భారీ నుంచి అతిభారీ వర్షాల నేపథ్యంలో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల కలెక్టర్లకు ఆయన సూచనలు చేశారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ సిస్టమ్‌లో ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నప్పుడు వినియోగించే శ్యాటిలైట్ ఫోన్స్ పని తీరును పరిశీలించాలన్నారు. జిల్లాల్లో అత్యవసరమైతే శ్యాటిలైట్ ఫోన్స్ వినియోగించడానికి ఏర్పాట్లు చేయాలని స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా స్పష్టం చేశారు.
Read Also: Defence Minister Rajnath Singh: దేశ భద్రత, రక్షణ విషయంలో కలిసి ముందుకెళ్లాలి..
దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ఈనెల 17న పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తా దగ్గర వాయుగుండం తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ క్రమంలో నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం, జనజీవనం అస్త వ్యస్థం అయ్యే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నిషేధం విధించబడింది. ఇప్పటికే వేటలో వున్న మత్స్యకారులను వెనక్కి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజా రవాణా, రైల్వేల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ వుండాలని సూచనలు చేసింది. తీరం వెంబడి పెరిగిన గాలులు ఉద్ధృతంగా వీస్తాయని, గంటకు 60కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. కొత్తపట్నం తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు బోట్లను ఒడ్డుకు చేర్చుకున్నారు. తీర ప్రాంతంలోని ఐదు మండలాల్లో ప్రత్యేక బోట్లు, గజ ఈతగాళ్లను అధికారులు సిద్ధం చేశారు. తీర ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించనున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు చేశారు.