Heavy Rain alert to hyderabad once again
రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో బుధవారం రాత్రిపూట మరోసారి భారీ వర్షాలు కురియడంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా యూసుఫ్‌గూడ, బోరబండ ప్రాంతాల నుంచి వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు కూడా ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా.. సికింద్రాబాద్, బేగంపేట, ఎర్రగడ్డ, బోరబండ, పంజాగుట్ట, బషీర్‌బాగ్, మెహదీపట్నం, లక్డీకాపూల్, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ స్టేట్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ (టీఎస్‌పీడీఎస్) డేటా ప్రకారం, బాలానగర్‌లో అత్యధికంగా (104 మిమీ) 100 మిమీ మార్కును దాటింది. బోలారంలో 96 మి.మీ, ఫిరోజ్‌గూడలో 94.8 మి.మీ, మారేడ్‌పల్లిలో 93.5, కుత్బుల్లాపూర్‌లో 92, రామచంద్రపురంలో 91 మి.మీ వర్షపాతం నమోదైంది. అయితే.. గురువారం ఉదయం నుంచి వర్షం విరామం ఇవ్వడంతో.. లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి.
అయితే.. హైదరాబాద్‌లో గురు, శుక్రవారాల్లో పైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అంతేకాకుండా.. కొన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశగా 4-8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి సంబంధించి ఐఎండీ సూచన ప్రకారం.. గురువారం రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, సిరిసిల్ల, వనపర్తి, నారాయణపేటలతో పాటు గద్వాల్ జిల్లాలతో సహా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.