ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీకి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం అని తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అది వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్టోబర్ 23వ తేదీ నుంచి 25 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఆతదుపరి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచించారు.
Also Read: IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. 60 రూపాయలకే టికెట్!
మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు.