Cyclone Michaung: అన్నదాతలకు తీరని కష్టాలు మిగిల్చింది మిచౌంగ్ తుఫాన్. గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుఫాన్ ఎఫెక్ట్‌తో పంట నీట మునిగింది. దీంతో మనోవేదన చెందుతున్నారు రైతులు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మిచౌంగ్ తుపాను అపార నష్టం మిగిల్చింది. కోసిన చేను పొలాల్లోనే తడిచిపోయింది. మరికొన్నిచోట్ల ధాన్యం బస్తాలు వర్షంలో నానిపోయాయి. వాటిని రక్షించుకునేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు వరి పంట నేలకొరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో కాఫీ రైతులను మిచౌంగ్ తుఫాన్ నిండా ముంచింది. ఓ వైపు పంటల ఘోరంగా దెబ్బతినగా, డ్రై యార్డుల్లోని కాఫీ గింజలు కూడా తడిచిపోయాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎడతెరిపిలేని వర్షాలకు… వేరుశనగ, పొగాకు, వరి పంటలకు కొంత వరకూ నష్టం జరిగింది. కృష్ణా జిల్లాలో 2 లక్షల 83 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తడిచిపోయిన 20 వేల టన్నుల ధాన్యాన్ని గౌడొన్లకు పంపే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు జిల్లా కలెక్టర్ రాజబాబు.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరి కుప్పలు తడిసి ముద్దయ్యాయి. మొలకలు వస్తున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కడపజిల్లా రాజంపేట, ఒంటి మిట్ట, సిద్దవటం గ్రామాల్లో తుఫాన్ రైతులకు కన్నీటిని మిగిల్చింది. గాలి వానకు అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. మామిడి చెట్లు కుప్పకూలాయి. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వరిచేలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పొలాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో వరి పంట నెలకొరిగింది. దీంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని వరి రైతులకు మరోసారి నష్టాలు తెచ్చిపెట్టింది. కాకినాడలో తుఫాను అలజడి సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా 70 వేల 877 ఎకరాల్లో రైతులు ఖరీఫ్ సాగు చేయగా… దాదాపు 46 వేల హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. మరో 24 వేల హెక్టార్లలో కోతలు కోయాల్సి ఉండగా తుఫాన్ రైతులను ముంచేసింది. విజయనగరం జిల్లా మెంటాడలో ఖరీఫ్ పంట నీట మునిగిని పోవడంతో రైతులు కుదేలయ్యారు. మరో రెండు మూడు రోజుల్లో పంట చేతికి వస్తుంది అనుకునే సమయంలో అకాల వర్షం నిండా ముంచేసింది. వరి కోసి ఆరబెట్టే సమయంలో పంట నీట మునిగింది. సిక్కోలులోనూ చేతికందిన పంట వానపాలు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రంగు మారుతుందని ఆవేదన చెందుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో కల్లాల్లో రాశులు పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మరికొన్ని చోట్ల వరితో పాటు పత్తి, మిరప పంట కూడా నీట మునిగింది. పెట్టుబడి కోసం అప్పులు చేశామని చెబుతున్నారు. పంట చేతికందేసరికి అకాల వర్షాలు తమను తీవ్రంగా నష్టపరిచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.