ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే ఏపీని అగ్ర స్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జన్యుపరంగా, వారసత్వంగా వస్తున్న వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం అని అన్నారు. వ్యాధి నిర్ణారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోందన్నారు. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ఓరియెంటేషన్ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. ఈరోజు విజయవాడలో మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు.
‘ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే ఏపీని అగ్ర స్థానంలో నిలపాలన్నదే నా ఆకాంక్ష. రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారు. 2100 మంది తలసీమియాతో, ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్నారు. జన్యుపరంగా, వారసత్వంగా వస్తున్న ఈ వ్యాధిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. బాధితులకి క్రమం తప్పకుండా ఉచిత రక్త మార్పిడి చేస్తున్నాం. రాష్ట్రంలోని 5 ఐసిహెచ్‌యస్ సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేస్తున్నాం. వ్యాధి నిర్ణారణ అయిన వారికి ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో 19 లక్షల మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా, 10 లక్షల 50 వేల మందికి స్క్రీనింగ్ చేశారు. ఇందులో 19,000 మంది పైగా క్యారియర్స్ ఉన్నారు, 2100 మందికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. జన్యుపరమైన సికిల్‌సెల్ ఎనీమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులిస్తున్నాం. నోడలాఫిసర్లకు అవగాహన కల్పించేందుకు రెండు రోజుల పాటు శిక్షణ ఉంటుంది. తలసీమియా, హిమోఫీలియా, సికిల్ సెల్ ఎనీమియా విభాగాల్లో మరింత అవగాహన కల్పించేందుకు రెండు రోజుల ఓరియెంటేషన్ జరుగుతుంది’ అని మంత్రి సత్యకుమార్ చెప్పారు.